Andhra Pradesh: హైపవర్ కమిటీతో ఏపీ మునిసిపల్ కార్మికుల చర్చలు విఫలం
- 9 డిమాండ్లతో మొదలైన మునిసిపల్ కార్మికుల సమ్మె
- సమ్మె విరమణ దిశగా హైపవర్ కమిటీని ఏర్పాటు చేసిన జగన్
- కార్మిక సంఘాలతో 2 గంటలకు పైగా కమిటీ భేటీ
- సమ్మెను కొనసాగించనున్నట్లు ప్రకటించిన కార్మికుల సంఘం నేతలు
ఏపీలో మునిసిపల్ కార్మికులతో రాష్ట్ర ప్రభుత్వం నియమించిన హైపవర్ కమిటీ జరిపిన చర్చలు విఫలమయ్యాయి. రూ.3 వేల హెల్త్ అలవెన్స్ ఇవ్వడం సహా మొత్తం 9 డిమాండ్లతో ఏపీలోని అన్ని మునిసిపాలిటీల్లోని 35 వేల మందికి పైగా కార్మికులు సోమవారం నుంచి సమ్మెకు దిగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తక్షణమే కార్మికులు సమ్మె విరమించేలా చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేసిన సీఎం... కార్మికులతో చర్చల కోసం ముగ్గురు మంత్రులు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో ఓ హైపవర్ కమిటీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.
సీఎం ఆదేశాలతో వెనువెంటనే రంగంలోకి దిగిన మంత్రులు బొత్స సత్యనారాయణ, ఆదిమూలపు సురేశ్, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, సీఎం సమీర్ శర్మలతో కూడిన హైపవర్ కమిటీ కార్మిక సంఘం నేతలతో చర్చలు జరిపింది. దాదాపుగా రెండు గంటలకు పైగా జరిగిన ఈ చర్చలు ఓ కొలిక్కి రాలేదు. వెరసి హైపవర్ కమిటీతో చర్చలు విఫలమైనట్లుగా కార్మిక సంఘాల నేతలు ప్రకటించారు. తమ సమ్మెను కొనసాగించనున్నట్లు వారు ప్రకటించారు.