Sri Lanka: శ్రీలంకలో భగ్గుమంటున్న ధరలు... బియ్యం కిలో రూ.220కి పైమాటే!
- శ్రీలంకలో కొనసాగుతున్న తీవ్ర సంక్షోభం
- అప్పులకుప్పగా మారిన లంక
- చేతులెత్తేసిన ప్రభుత్వం
- చెలరేగిన నిరసన జ్వాలలు
- ఏదీ కొనలేని పరిస్థితిలో లంకేయులు
ప్రపంచ దేశాలన్నీ కరోనా విపత్తు నుంచి కోలుకుని, దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థలను బాగుచేసుకునే పనిలో ఉండగా, ఆసియా ద్వీపదేశం శ్రీలంక మాత్రం కనీవినీ ఎరుగని సంక్షోభంలో కూరుకుపోయింది. తీవ్ర రుణభారంతో ఆర్థిక సంక్షోభం తలెత్తగా, ప్రభుత్వం కూడా చేతులెత్తేసింది. దాంతో రాజకీయ సంక్షోభం కూడా రగులుతోంది. శ్రీలంకలో పరిస్థితులు అదుపు తప్పగా, నిరసనకారుల నుంచి దేశాధ్యక్షుడికే ముప్పు ఏర్పడిన పరిస్థితులు ఏర్పడ్డాయి.
ఇదిలావుంటే, శ్రీలంకలో పౌరజీవనం అస్తవ్యస్తంగా మారింది. దారుణ పరిస్థితుల నేపథ్యంలో 70 శాతం మంది లంక ప్రజలు ఆహార వినిమయాన్ని తగ్గించారన్న యునిసెఫ్ నివేదిక అత్యంత బాధాకరం. నిత్యావసరాల ధరలు మండిపోతుండడంతో ప్రజలు ఏదీ కొనే పరిస్థితి లేదు. బియ్యం కిలో రూ.220కి పైమాటే పలుకుతోంది. టమోటాలు, ఉల్లిగడ్డలు కిలో రూ.200 వరకు పలుకుతున్నాయి. క్యారెట్ అయితే కేజీ దాదాపు రూ.500కి చేరువలో ఉంది. పావుకిలో వెల్లుల్లి రూ.160 పలుకుతోంది.
అసలు, ఎంత ఖర్చు చేసైనా ఇంధనం కొందామటే చాలా చోట్ల 'నో స్టాక్' బోర్డులు దర్శనమిస్తున్నాయి. దాంతో పెట్రోల్, డీజిల్ కు తీవ్ర కొరత ఏర్పడడంతో ప్రజలు వాహనాలు పక్కనబెట్టి సైకిళ్లకు అత్యంత ప్రాధాన్యత నిస్తున్నారు. శ్రీలంకలో పెట్రోల్ లీటర్ రూ.470 ఉండగా, డీజిల్ లీటర్ ఒక్కింటికి రూ.460 ధర పలుకుతోంది. (పై ధరలన్నీ శ్రీలంక రూపాయలలో).