Doctor: యువతిని ఎరవేసి ఓ డాక్టర్ బలహీనతను సొమ్ము చేసుకున్న కేటుగాళ్లు!
- హైదరాబాదులో ఘటన
- డాక్టర్ కు అమ్మాయిల పిచ్చి
- డేటింగ్ సైట్లు, యాప్ లలో అమ్మాయిల కోసం వెదుకులాట
- డాక్టర్ బలహీనతను గుర్తించిన నేరగాళ్లు
అతడో వైద్యుడు. కానీ అమ్మాయిల బలహీనత ఉంది. పలు డేటింగ్ వెబ్ సైట్లు, యాప్ లలో అందమైన అమ్మాయిల కోసం వెదకడం ఓ వ్యసనంగా మారింది. అయితే, ఈ డాక్టర్ పలు డేటింగ్ సైట్లు, యాప్ లను సెర్చ్ చేయడాన్ని సైబర్ నేరగాళ్లు గుర్తించారు. ఇంకేముంది, ఓ అమ్మాయిని ఎరగా వేసి ఆ డాక్టర్ ను ముగ్గులోకి దించారు. అందమైన యువతిని పంపిస్తామంటూ ఆ డాక్టర్ ను ప్రలోభానికి గురిచేసి పలు దఫాలుగా రూ.40 లక్షల వరకు గుంజారు.
దీనిపై ఆ డాక్టర్ నిజాన్ని గ్రహించి 2020లోనే సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే... తాను మోసపోయానని గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేసిన తర్వాత కూడా ఆ వైద్యుడు సదరు అందమైన అమ్మాయి కోసం మరో రెండు దఫాలుగా నగదును నిందితుల ఖాతాల్లో వేశాడు. ఆ విధంగా మొత్తం రూ.80 లక్షలు నగదు బదిలీ చేశాడు.
దీనిపై పోలీసులు ఆ డాక్టర్ మహాశయుడికి కౌన్సిలింగ్ ఇచ్చినా నిష్ప్రయోజనం అయింది. కుటుంబ సభ్యులు అతడి బ్యాంకు ఖాతాలు పరిశీలించగా, మూడేళ్ల కాలంలో మొత్తం రూ.1.5 కోట్లు గల్లంతైనట్టు వెల్లడైంది. కాగా, ఆ నగదు ఏ బ్యాంకు ఖాతాకు బదిలీ అయిందో గుర్తించిన పోలీసులు నిందితుడ్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.