heavy rains: ప్రమాదకరంగా నిర్మల్ జిల్లా కడెం ప్రాజెక్టు.. రెడ్ అలెర్ట్ జారీ

Red alert issued at  Kadem project in Nirmal district

  • భారీగా వరద రావడంతో కట్ట పైనుంచి పొంగుతున్న నీళ్లు
  • రెడ్ అలెర్ట్ జారీ చేసి, సమీప గ్రామస్థులను తరలిస్తున్న అధికారులు
  • పరిస్థితిని దగ్గరుండి పర్యవేక్షిస్తున్న మంత్రి అల్లోల, ఎమ్మెల్యే రేఖా నాయక్

తెలంగాణలో వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో ప్రాజెక్టులన్నీ పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకుంటున్నాయి. రాష్ట్రంలో భారీ వర్షంతో పాటు ఎగువ నుంచి నిర్మల్ జిల్లాలోని కడెం ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దాంతో ప్రాజెక్టు నీటి మట్టం ప్రమాదకర స్థాయికి చేరుకుంది. 

ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే రేఖా నాయక్, కలెక్టర్, జిల్లా ఎస్పీ, రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులతో కలిసి మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి పరిస్థితిని దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. ముందు జాగ్రత్త చర్యగా కడెం ప్రాజెక్టు పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.

కడెం ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 700 అడుగులు కాగా పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 7.603 టీఎంసీలు.  ప్రస్తుతం 17 గేట్లు ఎత్తి అధికారులు రెండు లక్షల 50వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. అయినా అవుట్ ఫ్లో కంటే ఇన్ ఫ్లో రెండు లక్షల క్యూసెక్కులు ఎక్కువ ఉండడంతో ప్రాజెక్టు కట్ట పైనుంచి నీరు ప్రవహిస్తుంది. వరద ఇంకా పెరిగితే ప్రమాదం పొంచి ఉందని అధికారులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. దాంతో, కడెం ప్రాజెక్టు వద్ద రెడ్ అలర్ట్ జారీ చేసిన అధికారులు,  ప్రాజెక్టు పరిధిలోని 12 గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే పనిలో నిమగ్నమయ్యారు.

  • Loading...

More Telugu News