YS Sharmila: లిక్కర్ ఆదాయం మీదున్న శ్రద్ధ, పేదల ఆరోగ్యంపై లేదు: షర్మిల
- నోటీసులు ఇచ్చి మరీ లిక్కర్ ఆదాయం పెంచుకుంటున్నారన్న షర్మిల
- పేదలకు వైద్యం అందించలేని ప్రభుత్వం ఉంటే ఎంత? లేకపోతే ఎంత? అంటూ ఎద్దేవా
- పేదలకు ఉచిత వైద్యం అందించాలనే సోయి కూడా లేదని వ్యాఖ్య
లిక్కర్ ద్వారా ఆదాయం పెంచుకుంటున్నారని ముఖ్యమంత్రి కేసీఆర్ పై వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల మండిపడ్డారు. లిక్కర్ ఆదాయం తగ్గిందని, నోటీసులు ఇచ్చి మరీ ఆదాయం పెంచుకోవడం మీద చూపిన శ్రద్ధ... పేదోనికి వైద్యం అందించడంలో మాత్రం లేదని విమర్శించారు. ముందస్తు, వెనకస్తు ఎన్నికల సవాళ్లు విసరడంలో చూపే ఆరాటం ప్రజలకు వైద్యం అందించడంలో లేదని అన్నారు. పేదలకు వైద్యం కూడా అందించలేని ప్రభుత్వం ఉంటే ఎంత? ఊడితే ఎంత? అంటూ ఎద్దేవా చేశారు.
పేరుకే ఆరోగ్యశ్రీ, ఆయుష్మాన్ భారత్.. పేదలకు వైద్యం మాత్రం గాల్లో దీపమని అన్నారు. ఆరోగ్యశ్రీకి డబ్బులు చెల్లించరని... పేదోనికి రోగమొస్తే అప్పు సప్పు చేసి, ఆస్తులు అమ్ముకొని ప్రాణాలు బతికించుకోవాలని చెప్పారు. కార్పొరేట్ దోపిడీకి గురవుతున్నా సర్కార్ కు పట్టింపు లేదని... ఉచిత వైద్యం అందించాలనే సోయి లేదని విమర్శించారు.