Telangana: బోర్డుకు తెలుగు రాష్ట్రాల ప్రాజెక్టుల అప్పగింతపై సందిగ్ధత
- జల వివాదాల పరిష్కారం కోసం బోర్డు ఏర్పాటు
- బోర్డు పరిధిలోకి రావాల్సి ఉన్న రెండు రాష్ట్రాల ప్రాజెక్టులు
- రేపటితో ముగియనున్న గడువు
- ప్రాజెక్టులను బోర్డుకు అప్పగించబోమన్న తెలంగాణ
- తెలంగాణ ఇస్తేనే తామూ అప్పగిస్తామన్న ఏపీ
రాష్ట్ర విభజన తర్వాత తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న జల వివాదాలను పరిష్కరించే నిమిత్తం ఇరు రాష్ట్రాల పరిధిలోని సాగు నీటి ప్రాజెక్టుల నిర్వహణను కేంద్ర బోర్డుకు అప్పగించే వ్యవహారంపై మరోమారు సందిగ్ధత నెలకొంది. గోదావరి, కృష్ణా నదులపై రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రాజెక్టుల నిర్వహణ, పర్యవేక్షణ కోసం కేంద్ర జల శక్తి శాఖ బోర్డును ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. కేంద్రం జారీ చేసిన ఆదేశాల మేరకు రెండు రాష్ట్రాలు తమ పరిధిలోని ప్రాజెక్టులను రేపటి లోగా (జులై 14, 2022లోగా) బోర్డుకు అప్పగించాల్సి ఉంది. అంటే.. ఈ గడువు రేపటితో ముగియనుందన్న మాట.
ఇలాంటి నేపథ్యంలో తన పరిధిలోని ప్రాజెక్టులను బోర్డుకు అప్పగించేది లేదంటూ తెలంగాణ కేంద్ర ప్రభుత్వానికి తేల్చి చెప్పింది. అదే సమయంలో తెలంగాణ తన ప్రాజెక్టులను బోర్డుకు అప్పగిస్తేనే... తాను కూడా తన ప్రాజెక్టులను బోర్డుకు అప్పగిస్తానంటూ ఏపీ కూడా మెలిక పెట్టింది. వెరసి బోర్డుకు ప్రాజెక్టుల అప్పగింతపై సందిగ్ధత నెలకొంది. ఒక రోజులో గడువు ముగియనున్న నేపథ్యంలో కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్న విషయంపై ఆసక్తి నెలకొంది.