COVID19: దేశంలో మళ్లీ పంజా విసురుతున్న కరోనా.. ఒక్క రోజులో 20 వేలకు పైగా కేసులు
- గడచిన 24 గంటల్లో 20,139 కొత్త కేసుల నమోదు
- మొన్నటితో పోలిస్తే మూడు వేలకు పైగా పెరుగుదల
- తాజాగా 39 మంది మృతి
దేశంలో కరోనా మళ్లీ పంజా విసురుతోంది. ఒక్క రోజులో కేసుల సంఖ్య 20 వేలకు చేరుకుంది. గత 24 గంటల్లో 20,139 పాజిటివ్ కేసులు నమోదైనట్టు కేంద్ర ఆరోగ్య శాఖ గురువారం ఉదయం ప్రకటించింది. మొన్నటితో పోలిస్తే మూడు వేల పైచిలుకు కేసులు ఎక్కువ కావడం గమనార్హం. బుధవారం 16,906 కేసులు నమోదైనట్టు పేర్కొన్నారు.
గడచిన 24 గంటల్లో 32 మంది మృతి చెందారు. ఇదే సమయంలో 16,482 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 1,36,076 క్రియాశీల కేసులు ఉన్నాయి. దేశంలో ఇప్పటిదాకా కరోనా నుంచి 4,30,28,356 మంది కోలుకున్నారు. మొత్తంగా 5,25,557 మంది చనిపోయారు.
ప్రస్తుతం దేశంలో కరోనా రోజువారీ పాజిటివిటీ రేటు 5.10 శాతంగా నమోదైంది. రికవరీ రేటు 98.49 శాతంగా ఉండగా.. మరణాల రేటు 1.20 శాతంగా ఉంది. ఇక, దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు 1,99,27,27,559 డోసుల కరోనా వ్యాక్సిన్ పంపిణీ చేశారు. నిన్న కొత్తగా 13,44,714 డోసులు అందజేశారు.