offbeat: గోడలుండవు.. పైకప్పు ఉండదు. బిల్లు మాత్రం పేలిపోతుంది.. 'జీరో స్టార్ హోటల్' ఎక్కడుందో తెలుసా?
- సరికొత్త కాన్సెప్ట్ ను తీసుకొచ్చిన స్విట్జర్లాండ్ లోని ఓ హోటల్
- ఓ ప్లాట్ ఫామ్ పై డబుల్ కాట్ బెడ్, అటూ ఇటూ బెడ్ ల్యాంప్స్.. అంతే
- రాత్రి చుక్కలు చూడొచ్చు.. పగలంతా రోడ్లు, ఆరు బయట ప్రాంతాలు చూడొచ్చు!
అదో హోటల్ గది.. మంచి డబుల్ కాట్ బెడ్.. ఓ పక్కన చిన్న టేబుల్.. దానిపై కావాల్సిన సామగ్రి.. అటూ ఇటూ ల్యాంప్స్.. చల్లటి గాలి.. పైకి చూస్తే నక్షత్రాలు కనిపిస్తాయి.. పక్కకు చూస్తే భవనాలు కనిపిస్తుంటాయి. అటూ ఇటూ తిరిగే కార్లు, మనుషులూ అన్నీ కళ్ల ముందే ఉంటాయి. ఇదెలా అనిపిస్తుంది కదా.. ఎందుకంటే ఈ హోటల్ గదికి పైకప్పు ఉండదు, చుట్టూ గోడలు కూడా ఉండవు. ముందు చెప్పినట్టుగా ఓ ప్లాట్ ఫాం (ఎత్తు గద్దె వంటిది) జస్ట్.. ఓ బెడ్, చిన్న టేబుల్, ల్యాంప్స్ మాత్రమే ఉంటాయి. ఇదే జీరో స్టార్ హోటల్ ప్రత్యేకత. ఈ మధ్యే స్విట్జర్లాండ్ లో ఈ సరికొత్త హోటల్ అందుబాటులోకి వచ్చింది.
ఏ సౌకర్యాలు లేకుండా..
మామూలుగా సౌకర్యాలను బట్టి హోటళ్లకు స్టార్ రేటింగ్ ఇస్తారు. టూ, త్రీ, ఫైవ్ స్టార్.. ఇలా ఉంటాయి. ఇక్కడ అలాంటి సౌకర్యాలేమీ ఉండవు కాబట్టి, వినూత్న కాన్సెప్ట్ కాబట్టి దీనికి పేరు కూడా చిత్రంగానే ‘నల్ స్టెర్న్ హోటల్ (జీరో స్టార్ హోటల్)’ అని పేరు పెట్టారు. దీనికి గోడలు, తలుపులే కాదు. ఏకాంతమూ ఉండదు, ఎలాంటి రక్షణ కలిగించే సదుపాయమూ ఉండబోదు. అయితే కావాల్సిన ఫుడ్, ఇతర అవసరాలేమైనా ఉంటే హోటల్ సిబ్బంది వచ్చి తెచ్చిస్తారు.
- స్విట్జర్లాండ్ కు చెందిన ఆర్టిస్టులు ఫ్రాంక్ రిక్లిన్, పాట్రిక్ రిక్లిన్ బ్రదర్స్ ఈ వినూత్న ఆలోచన చేయగా.. డానియేల్ కార్బొనియెర్ అనే ఆయన ఈ హోటల్ ను సిద్ధం చేశారు.
- ఓ వైపు ఆరు బయట నక్షత్రాలు చూస్తూ గడిపే అనుభూతి, మరోవైపు వాతావరణంలో వస్తున్న మార్పులు, కాలుష్యం, రణగొణ ధ్వనులు భూమికెంత నష్టం చేస్తున్నాయో తెలియజెప్పడమే తమ లక్ష్యమని హోటల్ రూపకర్తలు చెబుతున్నారు.
- ఏమీ లేని జీరో స్టార్ హోటల్ అయినంత మాత్రాన డబ్బులు తక్కువగా కడతామంటే ఒప్పుకోరు. ఇక్కడ ఒక రాత్రి ఉండాలంటే.. మన కరెన్సీలో దాదాపు రూ.28 వేలు చెల్లించాల్సి ఉంటుంది.
- ప్రస్తుతం ఇక్కడి సైలన్ అనే పట్టణంలోని పెట్రోల్ బంక్ పక్కన ఒకటి, వైన్ యార్డ్ లో మరొకటి, సమీపంలోని పిక్చర్ స్క్వేర్ కొండ పక్కన ఇంకోటి ‘జీరో స్టార్ హోటల్’ గదులను ఏర్పాటు చేశారు.