Team India: కేఎల్ వస్తే... కోహ్లీ వెళ్లాడు!... వెస్టిండిస్‌తో టీ20 సిరీస్‌కు భారత జట్టు ఇదే!
- కేఎల్‌తో పాటు జట్టులో చేరిన కులదీప్ యాదవ్
- రెస్ట్ కావాలన్న కోహ్లీ విజ్ఞప్తికి ఓకే చెప్పిన బీసీసీఐ
- హైదరాబాదీ బౌలర్ సిరాజ్‌కు దక్కని చోటు
- ఈ నెల 22 నుంచి టీమిండియా వెస్టిండిస్ టూర్ ప్రారంభం
- ట్రినిడాడ్ వేదికగా జరగనున్న మూడు మ్యాచ్‌ల సిరీస్
వెస్టిండిస్‌తో జరగనున్న టీ20 సిరీస్‌కు భారత క్రికెట్ జట్టును ప్రకటిస్తూ బీసీసీఐ గురువారం మధ్యాహ్నం ఓ ప్రకటన విడుదల చేసింది. రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ సారథ్యంలోనే బరిలోకి దిగనున్న ఈ జట్టులో రోహిత్‌తో పాటు ఇషాన్ కిషన్, కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, శ్రేయస్ అయ్యర్, దినేశ్ కార్తిక్, రిషబ్ పంత్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, రవి విష్ణోయ్, కులదీప్ యాదవ్. భువనేశ్వర్ కుమార్, అవేశ్ ఖాన్, హర్షల్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్‌లు ఉన్నారు.
రెండు సిరీస్‌ల పాటు జట్టుకు దూరంగా స్టార్ బ్యాట్స్‌మన్ కేఎల్ రాహుల్ వెస్టిండిస్ టూర్‌కు సిద్ధమైపోయాడు. ఫిట్నెస్ నిరూపించుకుని అతడు జట్టులో చేరిపోయాడు. అదే సమయంలో కులదీప్ యాదవ్ కూడా జట్టులో చేరిపోయాడు. కేఎల్ రాహుల్ తిరిగి జట్టుకు అందుబాటులోకి వచ్చాడనుకుంటే... మరో స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఈ సిరీస్‌కు దూరమయ్యాడు. తనకు విశ్రాంతి కావాలని స్వయంగా కోహ్లీ కోరడంతో బీసీసీఐ అతడి విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించింది. హైదరాబాదీ బౌలర్ మహ్మద్ సిరాజ్‌కు మాత్రం జట్టులో చోటు దక్కలేదు.
వెస్టిండిస్ వేదికగా జరగనున్న ఈ సిరీస్‌లో మొత్తం 3 టీ20 మ్యాచ్‌లు ఉన్నాయి. ఈ నెల 22 నుంచే ఈ సిరీస్ ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్ ట్రినిడాడ్ వేదికగా జరగనుంది. సిరీస్‌లో రెండు, మూడు మ్యాచ్‌లు ఈ నెల 24, 27 తేదీల్లో ట్రినిడాడ్ వేదికగానే జరగనున్నాయి. ప్రస్తుతం ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న భారత్... ఆ దేశ జట్టుతో ఇంకో రెండు వన్డే మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. వీటిలో గురువారం సాయంత్రం ఓ మ్యాచ్ జరగనుండగా, చివరి మ్యాచ్ ఈ నెల 17న జరగనుంది. ఈ సిరీస్‌ను ముగించుకున్న వెంటనే టీమిండియా వెస్టిండిస్ టూర్ కి బయలుదేరనుంది.