Britain: బోరిస్ జాన్సన్ వారసుడు రిషి సునాక్?... రెండో రౌండ్‌లోనూ సునాక్‌కే ఆధిక్యత
- గురువారం ముగిసిన రెండో రౌండ్ ఓటింగ్
- ఓటింగ్‌లో స్పష్టమైన మెజారిటీ సాధించిన సునాక్
- ఓటింగ్ నుంచి మరో అభ్యర్థి అవుట్
బ్రిటన్ ప్రధాన మంత్రి పదవి రేసులో భారత సంతతికి చెందిన రిషి సునాక్ మరింత దగ్గరయ్యారు. బుధవారం నుంచి మొదలైన ఓటింగ్‌లో తొలి రౌండ్ లో స్పష్టమైన మెజారిటీ సాధించిన సునాక్... తాజాగా గురువారం చేపట్టిన రెండో రౌండ్ ఓటింగ్‌లోనూ మెజారిటీ సాధించారు. అంతేకాకుండా రెండో రౌండ్ ఓటింగ్ ఫలితాలు వచ్చాక ప్రధాని పదవి రేసులో నిలిచిన మరో ఎంపీ రేసు నుంచి తొలగించబడ్డారు. వెరసి బ్రిటన్ ప్రధాని పదవి రేసులో రిషి సునాక్ మరింత ముందుకు దూసుకెళ్లారు.
ఓ వివాదాస్పద ఎంపీకి మంత్రి పదవి ఇచ్చిన బ్రిటన్ తాజా మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్... ఆయన కేబినెట్‌లో కీలక మంత్రిగా కొనసాగిన సునాక్ సహా మెజారిటీ మంత్రులు తమ పదవులకు రాజీనామా చేశారు. అదే సమయంలో జాన్సన్ రాజీనామాకు దేశ ప్రజలు పట్టుబట్టారు. ఫలితంగా బోరిస్ జాన్సన్ తన పదవికి రాజీనామా చేయక తప్పలేదు.
జాన్సన్ రాజీనామాతో అదికార కన్జర్వేటివ్ పార్టీ నేతగా ఎన్నుకునే ప్రక్రియ బుధవారం ప్రారంభమైంది. విడతలవారీగా జరిగే ఈ ఓటింగ్ ప్రక్రియలో చివరి అంకం దాకా నిలిచి మెజారిటీ సాధించిన నేత బ్రిటన్ పార్లమెంటులో కన్జర్వేటివ్ పార్టీ నేతగా ఎన్నిక కానున్నారు. అలా నెగ్గిన నేతే బ్రిటన్ ప్రధానిగా పదవీ బాధ్యతలు స్వీకరిస్తారు. రెండో రౌండ్ ఓటింగ్ ముగిసే సరికే ఇక బ్రిటన్ ప్రధాని రిషి సునాకేనన్న వాదనలు అంతకంతకూ పెరిగిపోయాయి.