Telangana: తెలంగాణలో వర్షాలకు నిరాశ్రయులైన 19 వేల మంది

 Over 19000 shifted to relief camps across State so far

  • అందరినీ సహాయక శిబిరాలకు తరలించిన ప్రభుత్వం
  • వరదల్లో చిక్కుకున్న 16 మందిని కాపాడిన ఎన్డీఆర్ ఎఫ్
  • మరో ఇద్దరిని ఎయిర్ లిఫ్ట్ చేసిన వైమానిక దళం
  • వరదలపై అధికారులతో సీఎస్ సోమేశ్ కుమార్ సమీక్ష

గత కొన్ని రోజులుగా తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. వరదలలో చిక్కుకొని ఎంతో మంది నిరాశ్రయులయ్యారు. వారిని ప్రభుత్వం సురక్షిత ప్రాంతాలకు తరలిస్తోంది. గురువారం సాయంత్రం వరకు రాష్ట్రవ్యాప్తంగా 19,000 మందిని రాష్ట్ర ప్రభుత్వం సహాయక శిబిరాలకు తరలించింది. 

ఈ క్రమంలో దాదాపు 16 మందిని జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ (ఎన్‌డిఆర్‌ఎఫ్) రక్షించగా, మరో ఇద్దరిని భారత వైమానిక దళం ఎయిర్ లిఫ్ట్ చేసింది. భద్రాచలంలో మూడు, ములుగు, భూపాలపల్లిలో ఒక్కొక్కటి చొప్పున ఏడు ఎన్‌డిఆర్‌ఎఫ్ బృందాలు తక్షణ సహాయక చర్యలు చేపట్టేందుకు రంగంలోకి దిగాయి. వివిధ ప్రాజెక్టుల్లోకి నీరు చేరుతున్న తీరును అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.
 
వరద బాధితుల కోసం రాష్ట్రవ్యాప్తంగా 223 ప్రత్యేక శిబిరాలను ఏర్పాటు చేయగా.. వాటిలోకి 19,071 మందిని తరలించారు. వీరిలో భద్రాచలంలో 43 క్యాంపులకు  6,318 మంది, ములుగులో 33 క్యాంపుల్లో 4,049 మంది, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 20 క్యాంపుల్లో 1,226 మంది ఉన్నారు. 
 
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ వివిధ శాఖల అధికారులతో ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. గోదావరి నదిలో నీటిమట్టం ఆందోళనకరంగా ఉన్నందున ములుగు, భూపాలపల్లి, భద్రాచలం జిల్లాలపై ప్రత్యేక దృష్టి సారించి, జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఇందులో రవాణా శాఖ మంత్రి  పువ్వాడ అజయ్‌కుమార్‌ కూడా పాల్గొన్నారు. గోదావరిలో నీరు ప్రమాదకర స్థాయికి చేరుకోవడంతో అన్ని శాఖలు మరింత అప్రమత్తంగా ఉండి, యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు ముమ్మరం చేయాలని అధికారులకు సీఎస్ సూచించారు.
 
రానున్న రెండు రోజుల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేయడంతో పాటు గోదావరి నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. దాంతో, శుక్రవారం నాటికి భద్రాచలం వద్ద నీటిమట్టం 70 అడుగులకు చేరుకునే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ముంపునకు గురయ్యే లోతట్టు ప్రాంతాలను గుర్తించి ఆయా ప్రాంతాల్లోని ప్రజలను ప్రత్యేక శిబిరాలకు తరలించాలని సోమేశ్ కుమార్ ఆదేశించారు. అత్యవసర కేసుల నిర్వహణ కోసం అదనపు బలగాలతో పాటు పడవలు, లైఫ్ జాకెట్లు తదితర పరికరాలను జిల్లాలకు పంపుతున్నట్లు డీజీపీ మహేందర్ రెడ్డి తెలిపారు.

  • Loading...

More Telugu News