- 9,000కు పైగా కేసుల నమోదు
- ఇందులో వెయ్యి కేసులు అమెరికాలోనే
- స్వలింగ సంపర్క పురుషుల్లోనే ఎక్కువ
- ఈ నెల 21న డబ్ల్యూహెచ్ వో అత్యవసర భేటీ
ఆఫ్రికా నుంచి పాశ్చాత్య దేశాలకు వ్యాపించిన మంకీపాక్స్.. ఆలస్యంగా భారత్ లోకి అడుగు పెట్టింది. అది కూడా వలసలు ఎక్కువగా ఉండే కేరళ రాష్ట్రంలో తొలి కేసు వెలుగు చూసింది. యూఏఈ నుంచి వచ్చిన వ్యక్తిలో దీన్ని గుర్తించారు. ప్రపంచవ్యాప్తంగా ఈ అంటు వ్యాధి ఇప్పటికే 63 దేశాలకు చేరిపోయింది.
63 దేశాల్లో ఇప్పటికి 9,000కు పైగా కేసులు నమోదైనట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ వారం మొదట్లోనే ప్రకటించింది. సౌదీ అరేబియా కూడా గురువారమే మొదటి కేసును గుర్తించింది. దీంతో బాధిత దేశాల సంఖ్య పెరగనుంది. ఈ క్రమంలో జులై 21న ప్రపంచ ఆరోగ్య సంస్థ అత్యవసర కమిటీ భేటీ కానుంది. ఈ వ్యాధికి సంబంధించి తాజా పరిస్థితులను సమీక్షించనుంది. ఈ వ్యాధి నివారణకు తీసుకుంటున్న చర్యలు, వాటి ఫలితాలను విశ్లేషించనుంది. అనంతరం ప్రపంచ దేశాలకు సూచనలు చేయనుంది.
ఇప్పటి వరకు వెయ్యికి పైగా కేసులు అమెరికాలోనే వచ్చాయి. అది కూడా పురుషుల్లోనే ఎక్కువ కేసులు వచ్చాయి. వారిలోనూ స్వలింగ సంపర్కుల్లో ఈ వ్యాధి ఎక్కువగా వ్యాపించింది. అయితే, ఎవరికైనా ఈ వ్యాధి రావచ్చని వైద్య నిపుణులు అంటున్నారు.
మంకీపాక్స్ వైరస్ బారిన పడిన వారిలో ఎక్కువగా జ్వరం, ఒళ్లు నొప్పులు, చలి, అలసట కనిపిస్తున్నాయి. వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉన్న వారిలో చర్మంపై దద్దుర్లు కనిపిస్తున్నాయి. లక్షణాలు రెండు నుంచి నాలుగు వారాల వరకు ఉంటున్నట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది. మరణాల రేటు 3-6 శాతం మధ్య ఉంటోంది.