China: మంట పెట్టినా కరిగిపోని ఐస్ క్రీమ్.. వీడియో చూస్తే అవాక్కవ్వాల్సిందే!
చైనాలోని జాంగ్ షుగావో చైస్ క్రీమ్ ప్రత్యేకత
మంట పెడితే కాలడమే కానీ, కరగని ఐస్ క్రీమ్
అధిక ఉష్ణోగ్రతల్లోనూ కరిగిపోదంటున్న కంపెనీ
నాణ్యత ప్రమాణాలతో తయారు చేసినట్టు వెల్లడి
వినడానికి ఇది విడ్డూరంగా, ఆశ్చర్యంగానే ఉన్నా.. నిజమేనని నమ్మాల్సి వస్తోంది. చైనాలో ఖరీదైన ఐస్ క్రీమ్ బ్రాండ్ తన చైస్ క్రీమ్ లు అధిక ఉష్ణోగ్రతల్లోనూ కరిగిపోవంటూ ఓ సంచలన ప్రకటన చేసింది. జాంగ్ షుగావో అనే కంపెనీ భారత కరెన్సీలో రూ.236 నుంచి రూ.827 మధ్య ధర ఉండే తన ఉత్పత్తులు మంట పెట్టినా కరిగిపోవని ప్రకటించడం విన్నవారికి నమ్మశక్యంగా అనిపించలేదు. అదెలా సాధ్యం? అనుకున్నారు.
కంపెనీ ప్రకటనతో ఓ వినియోగదారు చైస్ క్రీమ్ బార్ ఒకదానికి లైటర్ తో నిప్పు పెట్టి చూశారు. అది కరిగిపోవడానికి బదులు కాలుతుండడం కనిపించింది. అది చూసిన వారు అందులో ఏముందిరా బాబూ..? అని నోరెళ్లబెట్టారు. కాలిపోతున్న వాసన రావడాన్ని కస్టమర్ గుర్తించారు. కానీ, ఐస్ క్రీమ్ కరిగిపోలేదు. 31 డిగ్రీల సెల్సియస్ లో అరగంట పాటు ఐస్ క్రీమ్ కరిగిపోకుండా ఉందని మరో వినియోగదారు ప్రకటించాడు. ఐస్ క్రీమ్ కు ఫైర్ టెస్ట్ చేస్తున్న వీడియో యూట్యూబ్ లో చేరగా, అది వైరల్ అవుతోంది.
దీన్ని చూసిన వారు, ఐస్ క్రీమ్ నాణ్యత పట్ల ఆందోళన చెందున్నారు. కానీ, దీనికి ఐస్ క్రీమ్ ను తయారు చేసిన సంస్థ స్పందిస్తూ.. జాతీయ అథారిటీ ఏర్పాటు చేసిన నాణ్యత ప్రమాణాల మేరకే తాము తయారు చేసినట్టు ప్రకటించింది. ‘‘బైసాల్ట్ కోకోనట్ ఫ్లావర్డ్ ఐస్ క్రీమ్ లో.. పాలు, సింగిల్ క్రీమ్, కొబ్బరి తురుము, కండెన్స్ డ్ మిల్క్, పాలపొడి ఉన్నాయి’’ అని కంపెనీ తెలిపింది. మంటకే కరగనప్పుడు.. తిన్న తర్వాత కడుపు ఎలా అరాయించుకోగలదు? అన్న సందేహం వ్యక్తమవుతోంది.