ntv: వరదలో కొట్టుకుపోయిన ఎన్టీవీ జర్నలిస్టు మృతదేహం లభ్యం
- జగిత్యాలలో వరదల్లో చిక్కుకున్న కూలీల వార్తను కవర్ చేయడానికి వెళ్లిన జమీర్
- వరదలో కారుతో సహా కొట్టుకుపోయిన జర్నలిస్టు
- శుక్రవారం ఉదయం కారును వెలికి తీసిన అధికారులు
- జమీర్ మృతి పట్ల ఎమ్మెల్సీ కవిత సంతాపం
మూడు రోజుల కిందట వరదల్లో కొట్టుకుపోయిన ప్రముఖ తెలుగు న్యూస్ చానెల్ ఎన్టీవీ రిపోర్టర్ జమీర్ మృతి చెందారు. జగిత్యాల జిల్లా రాయికల్ మండలంలోని రామోజీ పేట వాగు వద్ద వరదల్లో చిక్కుకున్న కూలీల వార్తలను కవర్ చేయడానికి వెళ్లి కారుతో సహా కొట్టుకుపోయిన జగిత్యాల జిల్లాకు చెందిన జర్నలిస్టు జమీర్ మృతి చెందారని అధికారులు తెలిపారు. శుక్రవారం ఉదయం జమీర్ మృతదేహాన్ని, కారును వెలికి తీశారు.
కాగా, జమీర్ మృతి పట్ల ఎమ్మెల్సీ కవిత సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబానికి అండగా నిలుస్తామని హామీ చ్చారు. ‘విధి నిర్వహణకు వెళ్ళి, వరదల్లో కొట్టుకుపోయిన జగిత్యాలకు చెందిన జర్నలిస్టు జమీర్ మరణం అత్యంత బాధాకరం. జమీర్ కుటుంబానికి అండగా నిలుస్తాము. వార్తా సేకరణకు ప్రాధాన్యత ఇస్తూనే, వర్షాలు, వరదల పట్ల అప్రమత్తంగా ఉంటూ, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని మీడియా మిత్రులను కోరుతున్నాను’ అని కవిత ట్వీట్ చేశారు.