Snails: రాక్షస నత్తల భయం.. అమెరికాలోని ఫ్లోరిడాలో కొత్త తరహా లాక్​ డౌన్​!

Snails like ghosts A new type of lockdown in Florida in America
  • ఒక్క నత్త నుంచి రెండేళ్లలో 14.40 లక్షల నత్తలకు పెరిగే ప్రమాదం
  • 500 రకాల మొక్కలను తినే పరిస్థితిలో పంటలు, తోటలు సర్వ నాశనం
  • మనుషుల్లో మెనింజైటిస్ వ్యాధికారక సూక్ష్మజీవులకు నిలయమైన నత్తలు 
  • సహజ శత్రువులు లేని వాతావరణంలో విజృంభిస్తూ తీవ్ర నష్టం కలిగించే నత్తలు
అవి నత్తలు.. కాకపోతే కాస్త పెద్ద సైజువి.. ఎలుకల పరిమాణం దాకా పెరుగుతాయి. అయితే ఏంటి? నత్తలతో ఏమవుతుందిలే అనుకుంటే మాత్రం పప్పులో కాలేసినట్టే. ఎందుకంటే ఈ నత్తలు అమెరికాలోని ఓ ప్రాంతాన్ని వణికిస్తున్నాయి. ఏకంగా ఒక రకమైన కొత్త తరహా లాక్ డౌన్ ఆంక్షలు పెట్టడానికి కారణమయ్యాయి. మరి ఏమిటా నత్తలు, వాటితో సమస్య ఏంటో చూద్దాం.. 

మనుషులకు, మొక్కలకు డేంజర్..
‘జెయింట్ ఆఫ్రికన్ ల్యాండ్ స్నెయిల్’ జాతి నత్తలు పరిమాణంలో చాలా పెద్దవి. ఎనిమిది అంగుళాల పొడవు ఉంటాయి. తొమ్మిదేళ్ల పాటు జీవిస్తాయి. నీటిలో కాకుండా భూమిపై మొక్కలు, చెట్ల ఆకులను తింటూ బతుకుతుంటాయి. నిజానికి అవి కేవలం ఆఫ్రికా దేశాలకే పరిమితమై ఉండేవి. 1960 సమయంలో ఓడల్లో సరుకుల ద్వారానో, పెంచుకునేందుకు, తినేందుకు తెచ్చుకునే మనుషుల ద్వారానో అమెరికాకు చేరాయి. ఆ తర్వాత అక్కడక్కడా తమ సంతతిని ఒక్కసారిగా పెంచుకుంటూ భయోత్పాతం సృష్టిస్తున్నాయి.
  • మొదట అమెరికాలోని దక్షిణ ఫ్లోరిడా ప్రాంతంలో 1960లో వీటి సంతతి విజృంభించింది. అప్పట్లోనే ఆ ప్రదేశంలో నత్తలను నిర్మూలించేందుకు పదేళ్ల పాటు చర్యలు తీసుకుని, ఎనిమిది కోట్ల రూపాయలను ఖర్చు చేయాల్సి వచ్చింది. అయినా వాటి గుడ్ల ద్వారా అక్కడక్కడా మళ్లీ విజృంభిస్తూనే వస్తున్నాయి. 
  • ఒక్కో నత్త ఏడాదికి 1,200 గుడ్లు పెట్టి పిల్లలను కంటుంది, మళ్లీ ఈ పన్నెండు వందల నత్తలు ఒక్కోటీ 1,200 పిల్లలను కంటాయి. అంటే ఒక్క నత్త నుంచి రెండేళ్లలో 14.40 లక్షల నత్తలు పుడతాయి.
  • ఈ నత్తలు దాదాపు 500 రకాల మొక్కలను తింటాయి. అందువల్ల ఈ నత్తలు ఉన్న చోట ఏ రకం పంట అయినా, తోటలు అయినా దెబ్బతినడం ఖాయం. 
  • ఆఫ్రికన్ జెయింట్ నత్తలపై ఉండే సూక్ష్మజీవులతో మనుషుల్లో మెనింజైటిస్ వ్యాధి వస్తుంది. (మెదడుకు నీరు పట్టి.. తలనొప్పి, తీవ్ర జ్వరం, కండరాల బలహీనత, వణుకు, ఫిట్స్, కాంతిని ఏమాత్రం తట్టుకోలేకపోవడం వంటి లక్షణాలు ఉంటాయి. ఒకదశలో మరణం కూడా సంభవిస్తుంది).
  • ఈ నత్తలు కాంక్రీట్ ను కూడా తింటాయని.. దీనితో భవనాలు, ఇతర నిర్మాణాలు కూడా దెబ్బతినే అవకాశం ఉందని అమెరికా వ్యవసాయ శాఖ ప్రకటించింది.

సహజ శత్రువులు లేకపోవడంతో విజృంభిస్తూ..
ఏ జీవికి అయినా వాటి సాధారణ ఆవాసంలో సహజ శత్రువులు ఉంటాయి. అందువల్ల వాటి సంతతి నియంత్రణలో ఉంటుంది. ఇది ప్రకృతి సహజమైన నియమం.. అలా కాకుండా ఏదైనా జీవి పూర్తిగా కొత్త ప్రాంతానికి వెళితే.. సహజ శత్రువులు లేకపోవడంతో వాటి సంతతి ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోతుంది. ఆస్ట్రేలియాలో కుందేళ్లు, యూరప్ దేశాల్లో పాముల సంతతి ఇలాగే విపరీతంగా పెరిగి ఇబ్బందులు ఎదురయ్యాయి. ఇప్పుడు అమెరికాకు ఆఫ్రికన్ జెయింట్ నత్తలు పెద్ద సమస్యగా మారాయి.

లాక్ డౌన్ ఏంటి? 
ఇటీవల ఫ్లోరిడాలోని పోర్ట్ రిచీ పట్టణంలో జెయింట్ నత్తలను గుర్తించారు. ఈ నత్తల గుడ్లు మట్టి, మొక్కలు, కలప తరలింపు వంటి మార్గాల ద్వారా ఇతర ప్రాంతాలకు విస్తరించే ప్రమాదం ఉండటంతో వెంటనే ఆ ప్రాంతంలో రెండేళ్ల పాటు ఒక రకం లాక్ డౌన్ ను పెట్టారు.
  • ఆ ప్రాంతం నుంచి ఎలాంటి మొక్కలు, మట్టి, చెత్త, ఇంటి, భవన నిర్మాణ సామగ్రి, పంటలకు సంబంధించిన ఎలాంటి ఉత్పత్తులు, సామగ్రిని బయటికి తీసుకెళ్లకుండా నిషేధం విధించారు.
  • పొలాలు, తోటల్లో వినియోగించే వాహనాలను కూడా పూర్తిగా సర్వీసింగ్ చేసిన తర్వాతే ఇతర ప్రాంతాలకు తీసుకెళ్లాలని ఆదేశించారు. 
  • పోర్ట్ రిచీ పట్టణంలోని అన్ని ప్రాంతాలు, పొలాలు, తోటలు, ఉద్యానవనాల్లో నత్తలను చంపేసే రసాయనాలను చల్లుతున్నారు.

Snails
Jiant Snails
USA
Florida
Lockdown
African Snails
Africa
International
Offbeat

More Telugu News