Ex England bowler: స్పాన్సర్ల కోసమేనా..? కోహ్లీ కొనసాగింపుపై ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ సందేహం
- స్పాన్సర్లను సంతోష పెట్టాలన్న ఒత్తిడి బీసీసీఐపై ఉందేమోనన్న పనేసర్
- కోహ్లీని ఎందుకు తప్పించడం లేదని ప్రశ్న
- అతడికి అభిమానుల ఫాలోయింగ్ ఉందని వ్యాఖ్య
కోహ్లీ గత 13 ఇన్నింగ్స్ లలో కొట్టింది ఒకే ఒక అర్ధ సెంచరీ. 2019 తర్వాత అతడు అంతర్జాతీయ క్రికెట్లో ఒక్క సెంచరీ చేసింది లేదు. ఐపీఎల్ 2022 సీజన్ లో బ్యాటర్ గా పూర్తిగా విఫలమయ్యాడు. అయినా, ‘అతడో గొప్ప ఆటగాడు’ అంటూ టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, బీసీసీఐ చీఫ్ గంగూలీ, హెడ్ కోచ్ ద్రవిడ్ వెనకేసుకొస్తున్నారు.
దీంతో ఒక్కో ఆటగాడికి ఒక్కో నీతి చందంగా బీసీసీఐ వైఖరి ఉందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కోహ్లీ గొప్ప ఆటగాడు కాదని ఎవరూ అనరు. కానీ, అవకాశాలు ఇచ్చే సందర్భంలో నిలకడైన పనితీరునే ప్రామాణికంగా చూస్తారు. అటువంటప్పుడు గతంలో గొప్పగా ఆడాడన్న పేరుతో దీర్ఘకాలంగా ఫామ్ కోల్పోయిన ఆటగాడిని ఎంత కాలం అలా ఒక బెర్తుతో కొనసాగిస్తారు? అంటూ.. యువ ఆటగాళ్లు ఎందరో సత్తా చూపిస్తుంటే, వారిని కాదని నిలకడ లోపించిన కోహ్లీకి స్థానం కట్టబెడుతుండడంపై పలువురు మాజీ క్రికెటర్లు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.