TRS: కేంద్రంపై దూకుడుగా పోరాటం.. పలువురు సీఎంలతో కేసీఆర్ మంతనాలు: టీఆర్ఎస్ వెల్లడి
- కేంద్రం వైఖరిపై కేసీఆర్ సమరశంఖం అంటూ టీఆర్ఎస్ ప్రకటన
- పలు విపక్ష పార్టీల నేతలు, జాతీయ నాయకులతోనూ మాట్లాడుతున్నట్టు వెల్లడి
- దేశవ్యాప్తంగా నిరసనలతో కేంద్రం తీరును ఎండగట్టాలని నిర్ణయించినట్టు ప్రకటన
కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న అసంబద్ధ వైఖరిపై పోరాటం కోసం దేశవ్యాప్తంగా వివిధ విపక్ష పార్టీలతో సీఎం కేసీఆర్ మంతనాలు సాగిస్తున్నారని టీఆర్ఎస్ పార్టీ ప్రకటించింది. కేంద్రం మెడలు వంచి దేశంలో ప్రజాస్వామిక విలువలను కాపాడే దిశగా మరింత దూకుడుగా ముందుకు సాగుతున్నారని పేర్కొంది.
‘‘కలిసివచ్చే అన్నిరాష్ట్రాల విపక్ష పార్టీలను సమన్వయం చేసుకుంటూ, ప్రజావ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న బీజేపీ కేంద్ర ప్రభుత్వంపై సీఎం కేసీఆర్ పూరించనున్న ప్రజాస్వామిక సమర శంఖం ఇది. దేశంలో ప్రమాదంలో పడుతున్న ఫెడరల్, సెక్యులర్ ప్రజాస్వామిక విలువలను కాపాడాలనే తన ప్రయత్నాలకు కేసీఆర్ మరింత పదును పెట్టనున్నారు..” అని టీఆర్ఎస్ వెల్లడించింది. ఆర్థిక సంక్షోభంలోకి దేశాన్ని నెట్టివేస్తున్న కేంద్ర వైఖరిని తేటతెల్లం చేసేందుకు కూడా కేసీఆర్ కసరత్తు చేస్తున్నట్టు తెలిపింది.
ముఖ్యమంత్రులతో కేసీఆర్ మంతనాలు
కేంద్రంపై నిరసనలకు మద్దతు కూడగట్టేందుకు దేశంలోని పలు రాష్ట్రాల విపక్ష నేతలతో సీఎం కేసీఆర్ ఫోన్ లో మంతనాలు సాగిస్తున్నట్టు టీఆర్ ఎస్ వెల్లడించింది. శుక్రవారం పలువురు ముఖ్యమంత్రులతో కేసీఆర్ మాట్లాడారని.. జాతీయ నేతలతో చర్చలు కొనసాగుతున్నాయని తెలిపింది.
‘‘నేటి ఉదయం నుంచి పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, ఢిల్లీ ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్, తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ సన్నిహితులతో, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్, యూపీ ప్రతిపక్ష నేత అఖిలేశ్ యాదవ్, శరద్ పవార్ సహా ఇతర జాతీయ విపక్ష నేతలతో సీఎం కేసీఆర్ స్వయంగా ఫోన్ లో మాట్లాడుతున్నారు. కేంద్రంపై ప్రజాస్వామిక పోరాటంలో భాగంగా కేసీఆర్ ప్రతిపాదనలకు పలు రాష్ట్రాల విపక్ష పార్టీల ముఖ్యమంత్రులు, ప్రధాన ప్రతిపక్ష నేతలు సానుకూలంగా స్పందిస్తున్నారు..” అని టీఆర్ ఎస్ ప్రకటించింది.
దేశవ్యాప్త నిరసనలకు ప్రణాళిక
పార్లమెంటు సమావేశాలను వేదికగా చేసుకుని బీజేపీ, కేంద్ర ప్రభుత్వ దమననీతిపై పోరాటం చేయనున్నట్టు టీఆర్ఎస్ ప్రకటించింది. బీజేపీ ప్రభుత్వ అప్రజాస్వామిక విధానాలను తీవ్రంగా ఖండిస్తూ.. దేశవ్యాప్త నిరసనలతో కేంద్రం అసలు స్వరూపాన్ని ఎండగట్టేందుకు సీఎం కేసీఆర్ సన్నద్ధమవుతున్నట్టు తెలిపింది. అటు వరదల నుంచి రాష్ట్రాన్ని కాపాడేందుకు మంత్రులు, అధికార యంత్రాంగానికి ఆదేశాలు ఇస్తూనే.. ఇటు బీజేపీ అప్రజాస్వామిక విధానాల విపత్తు నుంచి దేశాన్ని కాపాడే పోరాటానికి కేసీఆర్ సమాయత్తం అయ్యారని పేర్కొంది.