India: భారత్ కు ఆంక్షల చట్టం నుంచి మినహాయింపు ఇవ్వాలంటూ యూఎస్ ప్రతినిధుల సభ తీర్మానం

US house of representatives votes for india specific caatsa sanctions waiver
  • రష్యా నుంచి భారత్ 'ఎస్–400' క్షిపణి వ్యవస్థ కొనుగోలు 
  • దీనిపై గతంలో భారత్ కు అమెరికా హెచ్చరికలు
  • చైనాను ఎదుర్కొనేందుకు భారత్ వెంట నిలవాల్సిన అవసరం ఉందన్న యూఎస్ కాంగ్రెస్ సభ్యులు  
  • ‘సీఏఏటీఎస్ఏ’ ఆంక్షల నుంచి భారత్ కు మినహాయింపు ఇవ్వాలంటూ తీర్మానం
రక్షణ పరికరాలు, ఆయుధాల అంశానికి సంబంధించి భారత్ కు ఆంక్షల చట్టం నుంచి మినహాయింపు ఇవ్వాలని అమెరికన్ ప్రతినిధుల సభ తాజాగా తీర్మానం చేసింది. దీనికి సంబంధించిన చట్ట సవరణ బిల్లును ఆమోదించింది. చైనా వంటి దూకుడుగా వెళ్లే దేశాల నుంచి రక్షణ పొందే దిశగా భారత్ కు అండగా నిలవాల్సి ఉందని ఈ సందర్భంగా ప్రతినిధుల సభలోని భారత సంతతి సభ్యులు స్పష్టం చేశారు. గతంలో రష్యా నుంచి ఎస్–400 క్షిపణి వ్యవస్థ కొనుగోలుకు భారత్ ఒప్పందం కుదుర్చుకోవడంతో అమెరికా భారత్ పై ‘సీఏఏటీఎస్ఏ’ కింద ఆంక్షలు విధిస్తామని హెచ్చరించింది.

ఏమిటీ సీఏఏటీఎస్ఏ?
ప్రపంచవ్యాప్తంగా ఆయుధ నియంత్రణ, ముఖ్యంగా రష్యా నుంచి ఆయుధాలు కొనుగోలు చేసే దేశాలను నిలువరించడం లక్ష్యంగా అమెరికా ‘కౌంటరింగ్ అమెరికాస్ అడ్వర్సరీస్ త్రూ శాంక్షన్స్ యాక్ట్ (సీఏఏటీఎస్ఏ)’ చట్టాన్ని చేసింది. రష్యా నుంచి ఇండియా ఆయుధాలు కొనుగోలు చేయడం, ముఖ్యంగా అధునాతన ఎస్–400 క్షిపణి వ్యవస్థ కొనుగోలుపై అమెరికా ఆగ్రహంతో.. సీఏఏటీఎస్ఏ కింద ఆంక్షలు విధిస్తామని హెచ్చరించింది. ఈ చట్టం నుంచి ఇండియాకు మినహాయింపు ఇవ్వాలంటూ తాజాగా ప్రతినిధుల సభ బిల్లును పాస్ చేసింది.

చైనాను ఎదుర్కొనేందుకు అండగా ఉండాలి..
ప్రతినిధుల సభలో బిల్లుపై చర్చ సందర్భంగా భారత సంతతి సభ్యుడు ఆర్ఓ ఖన్నా మాట్లాడారు. ‘‘చైనా వంటి దేశాల దూకుడును దీటుగా ఎదుర్కొనేందుకు భారత్ కు యునైటెడ్ స్టేట్స్ అండగా నిలవాల్సిన అవసరం ఉంది. ఇండియా–అమెరికా మధ్య సంబంధాలను, భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు మేం కృషి చేస్తున్నాం. చైనాతో ఉన్న సరిహద్దుల వెంట ఇండియా దీటుగా రక్షణ చర్యలు చేపట్టేందుకు తోడ్పడుతున్నాం. ఇప్పుడీ చట్ట సవరణ చాలా ముఖ్యమైనది. సభలో బిల్లు పాసవడం గర్వకారణంగా భావిస్తున్నాం..” అని పేర్కొన్నారు.
India
USA
US House of Representatives
Sanctions
CAATSA Act
International
S-400
S-400 Missile

More Telugu News