TDP: చంద్రబాబు నేతృత్వంలో టీడీపీ పార్లమెంటరీ పార్టీ భేటీ... హాజరైన నలుగురు ఎంపీలు
- ఈ నెల 18 నుంచి పార్లమెంటు సమావేశాలు
- పార్టీ వ్యూహం ఖరారుపై భేటీ అయిన టీడీపీపీ
- విభజన హామీల అమలు కోసం పోరాడాలని చంద్రబాబు దిశానిర్దేశం
పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ఈ నెల 18 నుంచి మొదలుకానున్న సంగతి తెలిసిందే. సమావేశాలకు మరో 3 రోజులు మాత్రమే సమయం ఉన్న నేపథ్యంలో ఆయా పార్టీలు సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై కసరత్తులు మొదలుపెట్టాయి. ఇందులో భాగంగా ఏపీలో విపక్ష పార్టీ టీడీపీ కూడా ఆ దిశగా శుక్రవారం పార్లమెంటరీ పార్టీ భేటీని నిర్వహించింది. పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి టీడీపీ ఏపీ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు, పార్లమెంటులో పార్టీ సభ్యులుగా కొనసాగుతున్న నలుగురు ఎంపీలు హాజరయ్యారు.
టీడీపీ తరఫున రాజ్యసభలో కనకమేడల రవీంద్ర కుమార్ ఎంపీగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇక లోక్ సభలో టీడీపీకి ముగ్గురు సభ్యులున్నారు. విజయవాడ ఎంపీ కేశినేని నాని, గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్, శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడులు టీడీపీ ఎంపీలుగా కొనసాగుతున్నారు. ఈ నలుగురు శుక్రవారం నాటి టీడీపీపీ భేటీకి హాజరయ్యారు. ఏపీ విభజన హామీల అమలు కోసం పార్లమెంటు సమావేశాల్లో పోరాటం కొనసాగించాలని ఎంపీలకు చంద్రబాబు దిశానిర్దేశం చేశారు.