Andhra Pradesh: ఛాతీ లోతు నీళ్లలో టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల పర్యటన... వీడియో ఇదిగో
- వరద నీటి ముంపులో లంక గ్రామాలు
- కనకాయలంకలో రాత్రి బస చేసిన పాలకొల్లు ఎమ్మెల్యే
- ఆరుబయటే స్నానాధికాలు ముగించుకున్న వైనం
- వరద నీటిలో నడుచుకుంటూనే సాగిన టీడీపీ ఎమ్మెల్యే
గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో నదీ పరీవాహక ప్రాంతాలు వరద ముంపులో చిక్కుకున్నాయి. ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు పరిధిలోని లంక గ్రామాల్లో పరిస్థితి దయనీయంగా ఉంది. ఈ నేపథ్యంలో వరద ముంపులో చిక్కుకున్న ప్రజలకు అభయమిస్తూ... జాగ్రత్తలు చెబుతూ వరద నీటిలోనే పర్యటన సాగించిన టీడీపీ నేత, స్థానిక ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడుకు చెందిన ఓ వీడియో ఆసక్తి రేకెత్తిస్తోంది. వరద ముంపులో చిక్కుకున్నా... వ్యాధుల బారిన పడకుండా ఉండేలా జాగ్రత్తలు సూచిస్తూ ఆయన సాగారు.
పాలకొల్లు పరిధిలోని కనకాయలంకలో గురువారం రాత్రి బస చేసిన ఆయన... శుక్రవారం ఉదయం అక్కడే ఆరుబయటే స్నానాధికాలు ముగించుకుని వరద నీటిలోనే తన పర్యటనను ప్రారంభించారు. పలు ప్రాంతాల్లో నడుములోతు నీరు, కొన్ని ప్రాంతాల్లో ఛాతీ లోతు నీళ్లలోనూ ఆయన నడుచుకుంటూనే ముందుకు సాగారు.
ఈ సందర్భంగా వరద ముంపు బాధితులకు ప్యూరిఫైడ్ నీటిని అందించాలని, పిల్లలకు పాలు, బిస్కెట్లు, పెద్దలకు భోజనాలు సమయానికి అందించాలని ఆయన అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇక వరద ముంపును ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదంటూ... ఆకాశంలో జగన్- వరద లో జనం అంటూ ఓ కామెంట్‌ను తన వీడియోకు యాడ్ చేశారు.