Telangana: అనుమతుల్లేని ప్రాజెక్టులను తక్షణమే ఆపండి... తెలుగు రాష్ట్రాలకు కేఆర్ఎంబీ ఆదేశం
- గతేడాది జులై 15న కేంద్ర జలశక్తి శాఖ గెజిట్ నోటిఫికేషన్ విడుదల
- శుక్రవారంతో గడువు ముగిసిన గెజిట్ నోటిఫికేషన్
- శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టులపై ఇరు రాష్ట్రాల మధ్య వివాదాలు ఉన్నాయన్న బోర్డు
ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు కృష్ణా నదీ జలాల యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) శుక్రవారం కీలక ఆదేశాలు జారీ చేసింది. అనుమతుల్లేని ప్రాజెక్టుల పనులను రెండు రాష్ట్రాలు తక్షణమే నిలిపివేయాలని బోర్డు ఆదేశాలు జారీ చేసింది. గతంలో కేంద్రం జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్ గడువు పూర్తయిన నేపథ్యంలో... ఆ విషయాన్ని ఇరు రాష్ట్రాలకు తెలియజేస్తూ శుక్రవారం రాసిన లేఖలో అనుమతుల్లేని ప్రాజెక్టు పనుల నిలిపివేతను ప్రధానంగా ప్రస్తావించింది. అంతేకాకుండా అనుమతుల్లేని ప్రాజెక్టులపై ఇరు రాష్ట్రాలు పరస్పరం ఫిర్యాదులు చేసుకున్న విషయాన్ని కూడా బోర్డు తన లేఖలో ప్రస్తావించింది.
రెండు రాష్ట్రాల పరిధిలో అనుమతుల్లేకుండానే కొనసాగుతున్న ప్రాజెక్టుల పనులను నిలిపివేయాలని కేంద్ర జలశక్తి శాఖ గతేడాది జులై 15న గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ కేంద్రం జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్ గడువు ఈ శుక్రవారంతో ముగిసిందని తెలిపింది.
శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టుల విషయంలో ఇరు రాష్ట్రాల మధ్య వివాదాలు ఉన్నాయని తెలిపిన బోర్డు... వాటి పరిష్కారం నిమిత్తం రెండు ప్రాజెక్టులకు సంబంధించి 15 కాంపోనెంట్లను స్వాధీనం చేసుకునేందుకు నిర్ణయం జరిగినట్లు పేర్కొంది. ఈ విషయంపై ఇరు రాష్ట్రాలు ఏకాభిప్రాయం వ్యక్తం చేశాయని తెలిపింది. ఈ నిర్ణయం అమలైతే ఈ రెండు ప్రాజెక్టులకు సంబంధించిన అన్ని వివాదాలు పరిష్కారం అవుతాయని కూడా బోర్డు అభిప్రాయపడింది.