Janasena: గుడ్ మార్నింగ్ సీఎం సర్.. రాజమహేంద్రవరంలో రోడ్ల దుస్థితి చూడండి అంటూ నాగబాబు ట్వీట్
- ఏపీలో రోడ్ల దుస్థితిపై ‘గుడ్ మార్నింగ్ సీఎం’ హ్యాష్ ట్యాగ్ తో జనసేన డిజిటల్ క్యాంపెయిన్
- ఈ నెల 15, 16, 17 తేదీల్లో ప్రచారం చేయాలని శ్రేణులకు పిలుపు
- రాజమహేంద్రవరం రోడ్ల పరిస్థితిని తెరపైకి తెచ్చిన నాగబాబు
ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలు, ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తీరును జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎప్పటికప్పుడు ఎండగట్టే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజా సమస్యలపై జనసేన నిత్యం పోరాటం చేస్తూనే ఉంది. వైసీపీ అధికారంలోకి వచ్చిన మూడేళ్ల కాలంలో ఇప్పటి వరకు రాష్ట్రంలో అనేక సమస్యలు పరిష్కారం కాకుండా అలాగే ఉన్నాయని పవన్ విమర్శించారు.
తాజాగా రాష్ట్రంలో రోడ్ల దుస్థితిపై జనసేన చేస్తున్న డిజిటల్ క్యాంపెయిన్ చర్చనీయాంశమైంది. ఈ నెల 15, 16, 17వ తేదీల్లో ‘గుడ్ మార్నింగ్ సీఎం సర్’ హ్యాష్ ట్యాగ్ తో రాష్ట్రంలోని అధ్వాన రోడ్ల ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేయాలని జనసేన తమ శ్రేణులకు పిలుపునిచ్చింది.
రంగంలోకి దిగిన జనసేన నాయకులు, కార్యకర్తలు వర్షాల కారణంగా మరింత అధ్వానంగా మారిన రాష్ట్రంలోని రోడ్ల దుస్థితిని బయట పెడుతున్నారు. ఈ క్రమంలో పవన్ సోదరుడు నాగబాబు కూడా రంగంలోకి దిగారు. రాజమహేంద్రవరంలో రోడ్లు దారుణంగా ఉన్నాయని చెప్పారు. గుడ్ మార్నింగ్ సీఎం సర్ అని రాసి ఉన్న ప్లకార్డులు పట్టుకొని ఈ రోడ్డు ముందు నిరసన చేపట్టారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను శనివారం ఉదయం ట్విటర్లో షేర్ చేశారు. రాజమహేంద్రవరంలో దారుణంగా ఉన్న రోడ్లను చూడాలని ముఖ్యమంత్రిని మేల్కొలుపుతున్నామని ట్వీట్ చేశారు.
కాగా, ఏపీలో రోడ్ల దుస్థితిపై ఇటీవల సమీక్ష నిర్వహించిన ఏపీ సీఎం వైఎస్ జగన్ ఈ నెల 15వ తేదీకల్లా మున్సిపాలిటీల పరిధిలో రోడ్లు అన్నింటినీ మరమ్మతులు చేయాలని అధికారులను ఆదేశించారు. నాడు నేడు పేరుతో ఆ రోడ్ల ఫొటోలను ప్రదర్శనకు పెట్టాలని కూడా సూచించారు. కానీ, మరమ్మతులు సకాలంలో పూర్తి కాకపోవడంతో పాటు వర్షాల కారణంగా రోడ్లు మరింత దెబ్బతిన్నాయి.