Teesta Setalvad: గుజరాత్లో అప్పటి మోదీ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు అహ్మద్ పటేల్ కుట్ర.. తీస్తా అందులో భాగస్వామి: పోలీసులు
- గుజరాత్ అల్లర్ల కేసులో మోదీని, అమాయక ప్రజలను ఇరికించే కుట్ర చేశారన్న ‘సిట్’
- ఆమెకు బెయిల్ ఇవ్వొద్దని విజ్ఞప్తి
- గుజరాత్ అల్లర్ల కేసులో మోదీకి క్లీన్ చిట్ ఇచ్చిన మర్నాడే తీస్తా అరెస్ట్
గుజరాత్ అల్లర్లపై దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) తాజాగా కోర్టుకు సమర్పించిన అఫిడవిట్లో పేర్కొన్న విషయాలు సంచలనం సృష్టిస్తున్నాయి. గుజరాత్లో అప్పటి మోదీ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు కాంగ్రెస్ పార్టీ దివంగత నేత అహ్మద్ పటేల్ కుట్ర పన్నారని, సామాజిక కార్యకర్త తీస్తా సెతల్వాద్ అందులో భాగమయ్యారని ఆరోపించింది. కాబట్టి ఈ కేసులో అరెస్టై ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్న ఆమెకు బెయిలు ఇవ్వొద్దని కోరింది. 2002 గుజరాత్ అల్లర్ల తర్వాత మోదీ ప్రభుత్వాన్ని గద్దె దించడంతోపాటు అధికారులు, అమాయక ప్రజలను ఇందులో ఇరికించేందుకు తీస్తా సెతల్వాద్ చట్ట విరుద్ధమైన ఆర్థిక ప్రయోజనాలను పొందినట్టు అందులో పేర్కొంది.
గుజరాత్ అల్లర్ల సమయంలో ప్రస్తుత ప్రధాని మోదీ ఆ రాష్ట్ర ముుఖ్యమంత్రిగా ఉన్నారు. ఈ కేసులో మోదీ సహా 62 మందికి ప్రత్యేక దర్యాప్తు బృందం క్లీన్చిట్ ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు ఇటీవల కొట్టేసింది. అయితే, ఈ అల్లర్ల వెనక భారీ కుట్ర ఉందని, పునర్విచారణ జరిపించాలని కోరుతూ ఆ అల్లర్లలో ప్రాణాలు కోల్పోయిన కాంగ్రెస్ దివంగత ఎంపీ ఎహసాన్ జాఫ్రీ భార్య జకియా జాఫ్రీ వేసిన పిటిషన్‌ను కోర్టు తోసిపుచ్చింది. ఈ సందర్భంగా కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.
గుజరాత్ అల్లర్లపై నిత్యం వివాదం రగులుతూ ఉండేలా 2006 నుంచి దురుద్దేశపూర్వకంగా పిటిషన్లు వేస్తున్నట్టు అర్థమవుతోందని, విచారణ ప్రక్రియ దుర్వినియోగంలో భాగస్వాములైన వారందరిపై చట్ట ప్రకారం చర్యలు ఉంటాయని హెచ్చరించింది. కోర్టు ఈ చేసిన వ్యాఖ్యలు తర్వాతి రోజే అమాయకులను ఇరికించేందుకు కుట్ర పన్నారంటూ తీస్తా సెతల్వాద్, గుజరాత్ మాజీ డీజీపీ ఆర్బీ శ్రీకుమార్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. సిట్ తాజాగా సమర్పించిన అఫిడవిట్‌ను పరిగణనలోకి తీసుకున్న కోర్టు తీస్తా సెతల్వాద్ బెయిలు పిటిషన్‌పై రేపు విచారణ చేపట్టనుంది.