Hyderabad: హైదరాబాద్‌లో ఔటర్ రింగురోడ్డుపై కాల్పుల కలకలం.. కారులో వచ్చి లారీ డ్రైవర్‌పై కాల్పులు జరిపిన దుండగుడు

Firing On Lorry Driver on Hyderabad outer ring road
  • మెదక్ నుంచి ఐరన్‌ లోడుతో వెళ్తున్న లారీ
  • తుక్కుగూడ ఎగ్జిట్ 14 వద్ద కాల్పులు
  • గురితప్పడంతో ప్రాణాలతో బయటపడిన మనోజ్
  • నిందితుడి కోసం మూడు బృందాల గాలింపు 
హైదరాబాద్ ఔటర్ రింగురోడ్డుపై కాల్పుల కలకలం రేగింది. ఐరన్ లోడుతో వెళ్తున్న లారీని వెంబడిస్తూ కారులో వచ్చిన ఓ ఆగంతుకుడు లారీ డ్రైవర్‌పై కాల్పులు జరిపాడు. అయితే, కాల్పులు గురితప్పడంతో లారీ డ్రైవర్ ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళ్తే.. లారీ డ్రైవర్ మనోజ్ మెదక్ నుంచి ఐరన్ లోడు తీసుకుని కేరళలోని కొచ్చికి బయలుదేరాడు. గతరాత్రి లారీ శంషాబాద్ తుక్కుగూడ ఎగ్జిట్ 14 వద్దకు రాగానే కారులో వెంబడిస్తూ వచ్చిన వ్యక్తి ఒక్కసారిగా మనోజ్‌పై కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో లారీ అద్దాలు పగిలిపోయాయి. మనోజ్ మాత్రం ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ కాల్పుల ఘటనను  అంతర్రాష్ట్ర  దోపిడీ దొంగల ముఠాగా పోలీసులు అనుమానిస్తున్నారు. 

లారీ డ్రైవర్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దుండగుల కోసం మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. కాగా, ఔటర్ రింగ్‌రోడ్డుపై గతంలోనూ ఇలాంటి పలు ఘటనలు జరిగాయి. విలువైన సరుకును రవాణా చేసే లారీలు, కంటెయినర్లను లక్ష్యంగా చేసుకుంటున్న దొంగలు.. డ్రైవర్లను బెదిరించడమో, హత్య చేయడం ద్వారానో వాటిలోని సరుకును అపహరిస్తున్నారు. లారీ టైర్లు, సబ్బులతో వెళ్తున్న లారీలను అడ్డగించి దోచుకున్న ముఠాకి ఇటీవల రాచకొండ పోలీసులు సంకెళ్లు వేశారు. కాగా, లారీ డ్రైవర్‌పై కాల్పులు జరిపిన నిందితుడు వరంగల్‌వైపు పరారై ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.
Hyderabad
Outer Ring Road
Lorry Driver
Gun Firing

More Telugu News