COVID19: 200 కోట్లు దాటిన కరోనా టీకాల పంపిణీ.. 18 నెలల్లో పూర్తి చేసిన కేంద్రం
- దేశవ్యాప్తంగా శనివారం రాత్రి వరకు 199.97 కోట్ల వ్యాక్సిన్ డోసులు
- ఇందులో 5.48 కోట్లు ప్రికాషన్ మూడో డోసు అని తెలిపిన కేంద్ర ఆరోగ్య శాఖ
- దేశంలో మొత్తంగా 96 శాతం మంది తొలిడోసు వ్యాక్సిన్ వేసుకున్నట్టు వెల్లడి
- ఆదివారం కూడా కొనసాగుతున్న వ్యాక్సినేషన్.. 200 కోట్లు దాటేస్తోందని ప్రకటన
దేశంలో కోవిడ్–19 వ్యాక్సినేషన్ లో భాగంగా టీకాల పంపిణీ 200 కోట్లకు చేరువైంది. శనివారం రాత్రి సమయానికల్లా దేశవ్యాప్తంగా 199.97 కోట్ల డోసులను వేసినట్టు కేంద్ర ఆరోగ్య శాఖ ఆదివారం ప్రకటించింది. ఆదివారం కూడా దేశంలో పలు చోట్ల వ్యాక్సిన్ల పంపిణీ కొనసాగుతోందని.. మొత్తంగా 200 కోట్ల డోసుల టీకాల పంపిణీ దాటేసినట్టేనని తెలిపింది. ఇప్పటివరకు వేసిన వ్యాక్సిన్లలో 5.48 కోట్ల మేర ప్రీకాషన్ (మూడో డోసు) టీకాలు ఉన్నట్టు వెల్లడించింది.
దేశవ్యాప్తంగా 14 వేలచోట్ల..
కోవిడ్ టీకాల పంపిణీకి సంబంధించిన కోవిన్ పోర్టల్ ప్రకారం.. దేశవ్యాప్తంగా ఆస్పత్రులు, ఆరోగ్య కేంద్రాలు సహా 14 వేల చోట్ల వ్యాక్సినేషన్ కొనసాగుతోంది. మన దేశంలో 2021 జనవరి 16న వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని మొదలుపెట్టగా.. దాదాపు 18 నెలల సమయంలో 200 కోట్ల డోసుల మేర టీకాల పంపిణీ పూర్తయింది.
- తొలి 100 కోట్ల వ్యాక్సిన్ల పంపిణీకి 277 రోజులు (సుమారు 9 నెలలు) పట్టింది.
- గత ఏడాది సెప్టెంబర్ 17న ఒకే రోజున దేశవ్యాప్తంగా ఏకంగా 2.5 కోట్ల వ్యాక్సిన్ డోసులను వేయడం రికార్డు సృష్టించింది
- దేశ జనాభాలో 96 శాతం మందికి తొలి డోసు వ్యాక్సినేషన్ పూర్తికాగా.. అందులో 87శాతం మందికి రెండు డోసులూ పూర్తయ్యాయి. ఇక 5.48 కోట్ల మందికి మూడో డోసు కూడా వేశారు.
- కరోనా మళ్లీ విజృంభిస్తున్న నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య శాఖ ఇటీవలే 18 ఏళ్లు పైబడిన వారికి ప్రికాషన్ (మూడో డోసు) వ్యాక్సిన్ ను ఉచితంగా పంపిణీ చేసేందుకు ప్రత్యేకంగా డ్రైవ్ చేపట్టింది.
- దేశంలో 18 ఏళ్ల నుంచి 59 ఏళ్ల మధ్యవారు 77.1 కోట్ల మంది ఉండగా.. ఇప్పటివరకు ఉచిత ప్రికాషన్ డోసును ఒక శాతం మందికే ఇచ్చారు.
- ప్రపంచవ్యాప్త గణాంకాల ప్రకారం.. ప్రపంచ జనాభాలో 62.1 శాతం మందికి కనీసం రెండు డోసుల కోవిడ్ వ్యాక్సినేషన్ పూర్తయింది.