Pawan Kalyan: భీమవరంలో ప్రధాని మోదీ సభకు తాను ఎందుకు రాలేదో చెప్పిన పవన్ కల్యాణ్
- ఇటీవల భీమవరంలో అల్లూరి విగ్రహావిష్కరణ
- హాజరైన ప్రధాని మోదీ
- తనకు కూడా ఆహ్వానం అందిందన్న పవన్
- స్థానిక ఎంపీని పిలవనప్పుడు తానెలా హాజరవుతానని వ్యాఖ్యలు
కొన్నాళ్లుగా జనసేన, బీజేపీ పార్టీలు ఏపీలో మిత్రపక్షాలుగా కొనసాగుతుండగా, ఈమధ్య కాలంలో ఈ రెండు పార్టీల మధ్య అంతరం ఏర్పడిందంటూ కథనాలు వచ్చాయి. అందుకు తగ్గట్టుగానే ఎవరి కార్యాచరణకు కట్టుబడి వారు ముందుకెళుతున్నారే తప్ప, ఉమ్మడి కార్యాచరణ కనిపించడంలేదు. ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ భీమవరంలో అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణ చేయగా, ఈ సభకు జనసేనాని పవన్ కల్యాణ్ గైర్హాజరయ్యారు. దాంతో ఇరుపార్టీల మధ్య సఖ్యత చెడిందంటూ ప్రచారం జరిగింది.
తాజాగా భీమవరంలో జనవాణి నిర్వహించిన పవన్ కల్యాణ్ మీడియాతో మాట్లాడుతూ, తాను ప్రధాని మోదీ సభకు ఎందుకు రాలేదో వెల్లడించారు. భీమవరంలో ప్రధాని మోదీ సభకు తనను కూడా ఆహ్వానించారని తెలిపారు. అయితే స్థానిక ఎంపీకే ఆ కార్యక్రమంలో ఆహ్వానం లేనప్పుడు తాను ఎలా హాజరవుతానని ప్రశ్నించారు. స్థానిక ఎంపీని పిలవని కార్యక్రమానికి తాను వెళ్లడం సబబు కాదని భావించానని, అందుకే మోదీ సభకు వెళ్లకూడదని నిర్ణయించుకున్నానని తెలిపారు.