Tesla Model X: టెస్లా ఎలక్ట్రిక్ కార్ల రికార్డ్.. ఎవరెస్ట్ బేస్ క్యాంప్ కు చేరిక
- 17,060 అడుగుల ఎత్తయిన ప్రదేశానికి టెస్లా ఎక్స్, వై
- చైనాకు చెందిన వ్లోగర్ల వినూత్న ప్రయత్నం
- సంప్రదాయ వాహనాలకు సైతం కష్టమైన ప్రయాణం
ఎలక్ట్రిక్ వాహనాల్లో టెస్లా బ్రాండ్ ప్రత్యేకతే వేరు, అత్యాధునిక టెక్నాలజీ, సామర్థ్యానికి టెస్లా ఎలక్ట్రిక్ కార్లు ప్రతీకగా ఉంటాయి. ఇప్పుడు టెస్లా ఎలక్ట్రిక్ కార్లు ఒక అరుదైన గుర్తింపును సొంతం చేసుకున్నాయి. టెస్లా మోడల్ ఎక్స్, మోడల్ వై ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన ఎవరెస్ట్ శిఖరం బేస్ క్యాంప్ ను చేరుకున్నాయి. చెంగ్డు నుంచి ఐదు రోజుల పాటు 2,414 కిలోమీటర్లు ప్రయాణించిన టెస్లా కార్లు.. సముద్ర మట్టానికి 17,060 అడుగుల ఎత్తయిన ప్రదేశానికి చేరాయి.
టెస్లా కార్ల సామర్థ్యాన్ని నిరూపించడానికి ఓ టెస్లా కారు యజమాని ఈ ఫీట్ చేశాడు. చైనాకు చెందిన వ్లోగర్ ట్రెన్ సెన్ చాంగ్ కింగ్ టెస్లా మోడల్ వై కారు యజమాని. అతడితోపాటు, అతడి స్నేహితుడు టెస్లా మోడల్ ఎక్స్ తో మౌంట్ ఎవరెస్ట్ బేస్ క్యాంప్ చేరుకున్నారు. నిజానికి సంప్రదాయ ఇంటర్నల్ కంబస్టన్ ఇంజన్లతో ఉన్న వాహనాలు సైతం ఇక్కడకు చేరడానికి అవస్థ పడుతుంటాయి. అలాంటిది టెస్లా కార్లు అవలీలగా ఎత్తయిన ప్రాంతాన్ని అధిరోహించడం గమనార్హం.
ఈ ఇద్దరి ప్రయాణానికి సంబంధించి వీడియోను టెస్లా చైనా షేర్ చేసింది. ఈ లక్ష్యాన్ని సాధించడానికి వీలుగా టెస్లా కార్లలో కొన్ని మార్పులు కూడా చేశారు. మార్గంలో టెస్లా సూపర్ చార్జర్ నెట్ వర్క్ ను కూడా నెలకొల్పారు. ఈ ఇద్దరు దారి పొడవునా తొమ్మిది సార్లు చార్జింగ్ పెట్టుకున్నారు. అంటే ఒక్కో చార్జింగ్ తో 257 కిలోమీటర్లు ప్రయాణించారు.