Jagan: చంద్రబాబు, ఈనాడు, టీవీ5, ఆంధ్రజ్యోతి, పవన్ విషప్రచారాలను తిప్పికొట్టాలి: జగన్
- వరద బాధితులను ఆదుకునేందుకు శక్తివంచన లేకుండా పని చేస్తున్నామన్న సీఎం
- దుష్టచతుష్టయం దుష్ప్రచారం చేస్తోందని
- దుష్ప్రచారాలను అధికారులు కూడా తిప్పికొట్టాలన్న జగన్
వరద బాధితులను ఆదుకునేందుకు శక్తివంచన లేకుండా పని చేస్తున్నామని ఏపీ ముఖ్యమంత్రి జగన్ అన్నారు. అయినప్పటికీ, మన స్థైర్యాన్ని దెబ్బతీయడానికి దుష్టచతుష్టయం ప్రయత్నిస్తోందని, పని కట్టుకుని బురద చల్లుతోందని విమర్శించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా సహాయక చర్యలను చేపడుతుంటే... చంద్రబాబు, ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5, పవన్ కల్యాణ్ లు రాష్ట్ర ప్రతిష్ఠ, అధికారుల ప్రతిష్ఠ దెబ్బతినేలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఉద్దేశపూర్వకంగానే దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు.
మీరు మంచి పనులు చేస్తున్నప్పుడు, వెనకడుగు వేయాల్సిన పని లేదని అధికారులకు జగన్ చెప్పారు. ఇలాంటి దుష్ప్రచారాలను, వదంతులను మీరు కూడా తిప్పికొట్టాలని సూచించారు. అధికారులకు అన్ని విధాలా సహాయ, సహకారాలను అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. నిధుల సమస్య లేదని... వరద బాధిత కుటుంబాలకు రేషన్, రూ. 2 వేలను రెండు రోజుల్లోగా ఇవ్వాలని ఆదేశించారు. వరద బాధిత కుటుంబాల పట్ల మానవత్వంతో మెలగాలని చెప్పారు.