Team India: ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ లో మూడో స్థానాన్ని నిలుపుకున్న టీమిండియా
- ఇంగ్లండ్ పై వన్డే సిరీస్ నెగ్గిన టీమిండియా
- భారత్ ఖాతాలో 109 రేటింగ్ పాయింట్లు
- త్వరలో విండీస్ తో సిరీస్
- నెగ్గితే మరిన్ని రేటింగ్ పాయింట్లు లభించే అవకాశం
ఇంగ్లండ్ పై వన్డే సిరీస్ నెగ్గిన టీమిండియా ఐసీసీ ర్యాంకింగ్స్ లో తన స్థానాన్ని పదిలపరుచుకుంది. నిన్న మాంచెస్టర్ లో జరిగిన మ్యాచ్ లో పంత్ వీరోచిత సెంచరీ, పాండ్యా పోరాటం ద్వారా టీమిండియా అద్భుత విజయం సాధించడం తెలిసిందే. తద్వారా 2-1తో సిరీస్ ను ఎగరేసుకెళ్లింది. ఈ క్రమంలో, ఐసీసీ తాజా వన్డే ర్యాంకింగ్స్ ను ప్రకటించింది. ఈ జాబితాలో టీమిండియా తన మూడో స్థానాన్ని నిలుపుకుంది.
ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ లో న్యూజిలాండ్ జట్టు నెంబర్ వన్ గా కొనసాగుతోంది. కివీస్ ఖాతాలో 128 రేటింగ్ పాయింట్లు ఉండగా, 121 పాయింట్లతో ఇంగ్లండ్ రెండోస్థానంలో ఉంది. కాగా, టీమిండియా మరికొన్ని రోజుల్లో వెస్టిండీస్ తో మూడు వన్డేల సిరీస్ ఆడనుంది. ఇందులో గెలిస్తే టీమిండియా ఖాతాలో మరిన్ని రేటింగ్ పాయింట్లు చేరే అవకాశం ఉంది.
ప్రస్తుతం టీమిండియా ఖాతాలో 109 పాయింట్లు ఉన్నాయి. టాప్-10 వన్డే జట్లలో భారత్ తర్వాతి స్థానాల్లో వరుసగా పాకిస్థాన్ (106), ఆస్ట్రేలియా (101), దక్షిణాఫ్రికా (99), బంగ్లాదేశ్ (98), శ్రీలంక (92), వెస్టిండీస్ (70), ఆఫ్ఘనిస్థాన్ (69) ఉన్నాయి.