Dadisetty Raja: సోమవారం నుంచి శుక్రవారం వరకు బాబు, లోకేశ్ రాజకీయం చేస్తారు... శని, ఆదివారాలు పవన్ తీసుకుంటాడు: మంత్రి దాడిశెట్టి రాజా
- పవన్ కల్యాణ్ ను టార్గెట్ చేసిన మంత్రి
- ఎప్పుడేం మాట్లాడతాడో తెలియదని ఎద్దేవా
- జగన్ పాలన పట్ల ఓర్వలేకపోతున్నాడని విమర్శలు
- బాబు, ఏబీఎన్ డైరెక్షన్ లోనే పవన్ నడుస్తున్నాడని వ్యాఖ్యలు
ఏపీ మంత్రి దాడిశెట్టి రాజా విపక్షనేత పవన్ కల్యాణ్ పై విమర్శలు గుప్పించారు. చంద్రబాబును వీలైనంత త్వరగా సీఎం చేయాలనే తాపత్రయం తప్ప పవన్ కు మరొక ఉద్దేశం కనిపించడంలేదని విమర్శించారు. గతంలో చంద్రబాబుతో కలిసి ఉన్నప్పుడు ఇదే మాదిరిగా హ్యాష్ ట్యాగ్ చేసుంటే పరిస్థితి ఇలా ఉండేదా? అని ప్రశ్నించారు. నాడు బాబు రోడ్ల నిధులను దారిమళ్లించినా పవన్ ఎందుకు అడగలేదు? అని నిలదీశారు. చంద్రబాబు రోడ్లు పట్టించుకోకపోయినా పవన్ నాడు ఏం మాట్లాడలేదని దాడిశెట్టి రాజా ఆరోపించారు.
ప్రతి రోడ్డుకు 8 ఏళ్ల నుంచి 10 ఏళ్ల వరకు జీవితకాలం ఉంటుందని, తాము అధికారంలోకి వచ్చి మూడేళ్లే అయిందని, ఆ రోజున రోడ్లు బాగు చేసి ఉంటే ఇవాళ ఈ పరిస్థితి ఉండేది కాదని వివరించారు.
అంతేకాదు, కోనసీమ జిల్లాకు అంబేడ్కర్ పేరుపెట్టడం, తదితర పరిణామాలపైనా దాడిశెట్టి రాజా స్పందించారు. కోనసీమ జిల్లాకు అంబేడ్కర్ పేరుపెట్టడాన్ని సమర్థించానని పవన్ తొలుత పేర్కొన్నాడని, కానీ ప్రభుత్వం తమ నిర్ణయం ప్రకటించగానే, కేవలం ఈ జిల్లాకు మాత్రమే పేరుపెట్టాలా? అంబేద్కర్ ను ఒక జిల్లాకే పరిమితం చేస్తారా? అని అన్నాడని ఆరోపించారు. అవన్నీ మర్చిపోయి, ఆ నిర్ణయాన్ని స్వాగతించింది తానేనని మళ్లీ పవనే అంటాడని, ఎప్పుడేం మాట్లాడతాడో అతడికే తెలియదని మంత్రి ఎద్దేవా చేశారు.
జగన్ పాలనలో పేదలకు, ప్రజలకు డీబీటీ విధానంలో రూ.1.65 లక్షల కోట్లు జమ కావడాన్ని పవన్ ఓర్వలేకపోతున్నాడని విమర్శించారు.
సోమవారం నుంచి శుక్రవారం వరకు బాబు, లోకేశ్ రాజకీయం చేస్తారని, ఆ తర్వాత శని, ఆదివారం రెండ్రోజులు పవన్ కల్యాణ్ రాజకీయం చేస్తాడని రాజా వ్యాఖ్యానించారు. శని, ఆదివారాలు వారికి కాల్షీట్ ఇచ్చాడని వ్యంగ్యం ప్రదర్శించారు. బాబు, ఏబీఎన్ డైరెక్షన్ మేరకే పవన్ నోటికొచ్చినట్టు తింగరి మాటలు, పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడని మండిపడ్డారు.