Uddhav Thackeray: శివసేనకు కొత్తరూపు... 100కి పైగా పదవులను కొత్తవారితో భర్తీ చేసిన ఉద్ధవ్ థాకరే
- ఇటీవల శివసేన పార్టీలో సంక్షోభం
- తిరుగుబాటు చేసిన ఏక్ నాథ్ షిండే
- అనూహ్యరీతిలో సీఎం పీఠం ఎక్కిన వైనం
- తీవ్ర అవమానంతో సీఎం పదవిని వీడిన ఉద్ధవ్ థాకరే
- పార్టీని మరింత బలోపేతం చేసేందుకు నిర్ణయం
ఇటీవల శివసేన పార్టీలో తలెత్తిన అంతర్గత సంక్షోభం ఉద్ధవ్ థాకరే సీఎం పీఠం నుంచి దిగిపోయేందుకు కారణమైంది. ఏక్ నాథ్ షిండే రూపంలో పుట్టిన ముసలం శివసేన చరిత్రలోనే అత్యంత తీవ్ర సంక్షోభానికి దారితీసింది. ఉద్ధవ్ థాకరే నాయకత్వంపై తిరుగుబాటు చేసిన షిండే, పార్టీ ఎమ్మెల్యేలను తనవైపుకు తిప్పుకుని ఏకంగా సీఎం అయ్యారు.
ఈ నేపథ్యంలో, శివసేన పార్టీని అట్టడుగుస్థాయి నుంచి ప్రక్షాళన చేసేందుకు ఉద్ధవ్ థాకరే నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 100కి పైగా పార్టీ పదవులను కొత్తవారితో భర్తీ చేశారు. ముంబయి, పాల్ఘాట్, యవట్మాల్, అమరావతి తదితర జిల్లాల్లో డిప్యూటీ జోనల్ అధ్యక్షులు, బ్రాంచ్ అధ్యక్షుల నియామకం చేపట్టారు. నూతన నాయకత్వానికి అవకాశం ఇచ్చారు.
క్షేత్రస్థాయి నుంచి శివసేనను బలోపేతం చేసి, మళ్లీ పూర్వవైభవం సాధించాలని ఉద్ధవ్ థాకరే కృతనిశ్చయంతో ఉన్నారు. అసెంబ్లీ నియోజకవర్గాల ప్రాతిపదికగా ఈ నియామకాలు చేపట్టినట్టు పార్టీ పత్రిక 'సామ్నా'లో వెల్లడించారు.