YSRCP: అమరావతి చేరిన హిందూపురం వైసీపీ పంచాయతీ.. పెద్దిరెడ్డి ముందే ఇరుపక్షాల వాదులాట
- ఎమ్మెల్సి ఇక్బాల్ వర్సెస్ నవీన్ నిశ్చల్, అబ్దుల్ ఘనీ
- కొంతకాలంగా హిందూపురంలో కొనసాగుతున్న విభేదాలు
- ఇటీవలే పరస్పరం రాళ్ల దాడులు చేసుకున్న ఇరువర్గాలు
- ఇక్బాల్‌ను కొనసాగిస్తే తాము పనిచేయలేమన్న నవీన్, ఘనీ
- సీఎం జగన్ చెబితే నియోజకవర్గాన్ని వీడతానన్న ఇక్బాల్
ఏపీలో అధికార పార్టీకి చెందిన హిందూపురం వర్గ పోరు మంగళవారం అమరావతి చేరింది. ఎమ్మెల్సీ షేక్ మహ్మద్ ఇక్బాల్.. 2014 ఎన్నికల్లో హిందూపురంలో పోటీ చేసిన నవీన్ నిశ్చల్, మాజీ ఎమ్మెల్యే అబ్దుల్ ఘనీ వర్గాల మధ్య గత కొంతకాలంగా విభేదాలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇటీవలే హిందూపురం ప్రెస్‌క్లబ్ వేదికగా ఇరువర్గాలు రాళ్ల దాడులు కూడా చేసుకున్నాయి. ఈ క్రమంలో ఇరు వర్గాలను మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మంగళవారం సచివాలయానికి పిలిచారు. అయితే సయోధ్య కోసం పిలిస్తే ఇరు వర్గాలు మంత్రి సమక్షంలోనే పరస్పరం వాదులాటకు దిగినట్టు తెలుస్తోంది.
పెద్దిరెడ్డి వారించడంతో కాస్తంత వెనక్కు తగ్గిన ఇరు వర్గాలు పరస్పరం ఫిర్యాదులు చేసుకున్నట్టు సమాచారం. ఈ సందర్భంగా ఇక్బాల్ వర్గంపై నవీన్ నిశ్చల్, అబ్దుల్ ఘనీలు మూకుమ్మడిగా ఫిర్యాదు చేశారు. హిందూపురం సమన్వయకర్తగా ఇక్బాల్‌ను కొనసాగిస్తే తాము పనిచేయలేమని వారు తేల్చి చెప్పారు. ఇక్బాల్ కారణంగా తాము చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని పెద్దిరెడ్డికి ఫిర్యాదు చేశారు. హిందూపురం పార్టీ శాఖలో గొడవలు వద్దనుకుంటే ఇక్బాల్‌ను తప్పించాల్సిందేనని వారు తేల్చి చెప్పినట్టు తెలుస్తోంది. స్థానికేతరుడైన ఇక్బాల్‌కు హిందూపురం టికెట్ ఇవ్వవద్దని వారు కోరారు.
రెండు వర్గాలు మూకుమ్మడిగా ఫిర్యాదు చేయడంతో ఇక్బాల్ ఒకింత అసహనానికి గురయ్యారు. పార్టీ అధిష్ఠానం ఆదేశాలు జారీ చేస్తే తాను హిందూపురం నియోజకవర్గాన్ని వదిలి వెళ్లేందుకు సిద్ధమేనని ఆయన పెద్దిరెడ్డికి చెప్పినట్టు సమాచారం. సీఎం జగన్ చెబితే తాను ఇప్పటికిప్పుడే నియోజకవర్గాన్ని వీడతానని కూడా ఆయన చెప్పారట. దీంతో పరిస్థితి చేజారిపోతోందని గ్రహించిన పెద్దిరెడ్డి ఇరు వర్గాలను శాంతింపజేసే యత్నం చేశారని, అంతేకాకుండా ఈ పంచాయితీని నేరుగా సీఎం జగన్ వద్దే ఏర్పాటు చేసేందుకు యత్నిస్తున్నట్లు సమాచారం.