Myanmar: శ్రీలంక మాదిరే మునిగిపోతున్న మయన్మార్
- 2,400కి పతమమైన కరెన్సీ
- మన రూపాయిల్లో 0.043కు సమానం
- కరిగిపోతున్న విదేశీ మారకం నిల్వలు
- కొనసాగుతున్న సైనిక ప్రభుత్వం అణచివేతలు
భారత్ పొరుగున ఉన్న చిన్న దేశాలు ఒక్కోటీ ఆర్థిక సంక్షోభం బారిన పడుతున్నాయి. శ్రీలంక ఇప్పటికే పూర్తి స్థాయి ఆర్థిక సంక్షోభాన్ని చూస్తోంది. గట్టెక్కడానికి భారత్, ఐఎంఎఫ్ సాయం అర్థిస్తోంది. ఈ లోపే మయన్మార్ సైతం ఆర్థిక అగాధంలోకి క్రమంగా జారుకుంటున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. డాలర్ తో ఆ దేశ కరెన్సీ క్యాట్ 2,400కు పడిపోయింది.
జులై 18 నాటికి మయన్మార్ కంపెనీలన్నీ 35 శాతం మేర తమ విదేశీ పెట్టుబడులు, విదేశీ కరెన్సీ ఆస్తులను స్థానిక కరెన్సీ అయిన క్యాట్ లోకి మార్చుకోవాలని మయన్మార్ సెంట్రల్ బ్యాంకు ఆదేశించింది. అయినా, కరెన్సీ పతనం ఆగడం లేదు. విదేశీ మారకం నిల్వలు పడిపోతుండడంతో అక్కడి సెంట్రల్ బ్యాంకు ఇలా ఆదేశించింది. 2021 ఫిబ్రవరి 1కి ముందు డాలర్ తో క్యాట్ విలువ 1,340గా ఉంది. ఆహారం, ఇంధన ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. రానున్న రోజుల్లో సంక్షోభం మరింత ముదురుతుందని నిపుణులు భావిస్తున్నారు.
ప్రజాస్వామ్య అనుకూల నిరసనలను అక్కడి సైనిక సర్కారు అణచివేసే కార్యక్రమాన్ని కొనసాగిస్తోంది. దీంతో అక్కడ హింసాత్మక చర్యలు పెరిగిపోయాయి.