Elon Musk: కొత్త తరం ఎలాన్ ల సృష్టికి నా వీర్యాన్ని అడిగారు: ఎలాన్ మస్క్ తండ్రి
- కొలంబియాకు చెందిన కంపెనీ తనను సంప్రదించిందన్న ఎర్రోల్ మస్క్
- ఓ ఉన్నత మహిళ గర్భం కోసం వీర్యదానాన్ని కోరినట్టు వెల్లడి
- భూమిపై ఉన్నది పునరుత్పత్తి చేయడం కోసమేనని వ్యాఖ్య
టెస్లా అధినేత, ఎలాన్ మస్క్ తండ్రి ఎర్రోల్ మస్క్ (76) సంచలన విషయాలు బయట పెట్టారు. కొత్త తరం ఎలాన్ లను తయారు చేయడానికి వీలుగా తన వీర్యాన్ని దానం చేయాలని కోరినట్టు ఎర్రోల్ మస్క్ వెల్లడించారు. తన పెంపుడు కుమార్తె జానా రూపంలో మరోసారి తండ్రి అవడం ద్వారా ఎర్రోల్ ఇటీవలే వార్తల్లో నిలిచారు.
‘‘కొలంబియాకు చెందిన ఓ కంపెనీ నన్ను సంప్రదించింది. కొలంబియాకు చెందిన ఓ ఉన్నత తరగతి మహిళ గర్భం దాల్చేందుకు వీర్యం దానం చేయాలని కోరింది. ‘ఎలాన్ (మస్క్) వద్దకు వెళ్లడం ఎందుకు, ఆయన్ను సృష్టించిన అసలు వ్యక్తి ఉన్నప్పుడు?’ అని వారు నాకు చెప్పారు’’ అంటూ ఎర్రోల్ మస్క్ ఆ విషయాన్ని బయటపెట్టారు.
వీర్య దానం చేసినందుకు డబ్బులు చెల్లించే విషయాన్ని మాత్రం వారు తనకు చెప్పలేదన్నారు. వారు చెప్పిన దానికి అంగీకరిస్తే తనకు ఇతర ప్రయోజనాలు లభిస్తాయని చెప్పారు. ఫస్ట్ క్లాస్ ఫ్లయిట్ ప్రయాణం, 5 స్టార్ హోటల్ లో విడిది, ఇతరత్రా సదుపాయాలు ఏర్పాటు చేస్తామని చెప్పినట్టు ఆయన తెలిపారు. ఈ కోరికలను మన్నిస్తారా? అని ప్రశ్నించగా.. తనకు మరో చిన్నారి కావాలని అనిపిస్తే చేస్తానని, చేయకుండా ఉండేందుకు ఏ కారణం కనిపించడం లేదని ఎర్రోల్ మస్క్ బదులిచ్చారు. భూమిపై ఉన్నది పునరుత్పత్తి చేయడం కోసమేనని ఆయన వ్యాఖ్యానించడం గమనార్హం.