Passport: 2022లో జపాన్ దే పవర్ ఫుల్ పాస్ పోర్ట్.. ఇండియా స్థానం ఎంతంటే..!
- రెండు, మూడు స్థానాల్లో సింగపూర్, దక్షిణ కొరియా
- యూరోపియన్ దేశాల్లో అగ్రస్థానంలో జర్మనీ
- 69వ స్థానంలో చైనా ..87వ స్థానంలో ఇండియన్ పాస్ పోర్ట్
- తక్కువ విలువ కలిగిన పాస్ పోర్ట్ గా ఆఫ్ఘనిస్థాన్
2022లో ప్రపంచంలో అత్యంత పవర్ ఫుల్ పాస్ పోర్ట్ గా జపాన్ పాస్ పోర్ట్ నిలిచింది. ఆ తర్వాతి స్థానాల్లో సింగపూర్, దక్షిణ కొరియా నిలబడ్డాయి. ప్రముఖ ఇమిగ్రేషన్ కన్సల్టెన్సీ సంస్థ హెన్లీ అండ్ పార్ట్ నర్స్ తాజాగా విడుదల చేసిన పాస్ పోర్ట్ ఇండెక్స్ లో ఈ విషయాన్ని పేర్కొంది. ప్రపంచం కోవిడ్ నుంచి కోలుకున్న తర్వాత యూరోపియన్ దేశాల ఆధిపత్యం తగ్గిపోయినట్టు తాజా నివేదికలో తేలింది. జపాన్ పాస్ పోర్ట్ తో 193 దేశాలకు ఎలాంటి సమస్యలు లేకుండా వెళ్లిపోవచ్చు. సింగపూర్, దక్షిణకొరియా పాస్ పోర్టులతో 192 దేశాలకు ఎలాంటి సమస్య లేకుండా వెళ్లొచ్చు.
పవర్ ఫుల్ పాస్ పోర్టుల్లో యూరోపియన్ దేశాల్లో జర్మనీ అగ్రస్థానంలో నిలిచింది. ఓవరాల్ గా ప్రపంచంలో నాలుగో పవర్ ఫుల్ పాస్ పోర్టుగా ఉంది. యూకే ఆరో స్థానంలో ఉంది. రష్యా 50వ స్థానంలో, చైనా 69వ స్థానంలో ఉన్నాయి. చైనా పాస్ పోర్ట్ కు 80 దేశాలతో ఈజీ యాక్సెస్ ఉంది. ఇండియా పాస్ పోర్ట్ 87వ స్థానంలో ఉంది. అన్నిటి కన్నా తక్కువ విలువ కలిగిన పాస్ పోర్ట్ గా ఆఫ్ఘనిస్థాన్ పాస్ పోర్ట్ నిలిచింది.