Yogi Adityanath: యోగి ఆదిత్యనాథ్ కేబినెట్ లో లుకలుకలు.. రాజీనామా చేసిన ఒక మంత్రి, యోగిపై అధిష్ఠానానికి మరో మంత్రి ఫిర్యాదు!
- తాను దళితుడిని కాబట్టి ప్రాధాన్యత ఇవ్వడం లేదంటూ దినేశ్ ఖాటిక్ రాజీనామా
- యోగిపై అసంతృప్తితో ఢిల్లీ వెళ్లి పార్టీ పెద్దలను కలిసిన మంత్రి జితిన్ ప్రసాద
- బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఇలా బహిరంగంగా అసంతృప్తి వెళ్లగక్కడం ఇదే మొదటిసారి అంటున్న రాజకీయ వేత్తలు
ఉత్తర ప్రదేశ్ లో యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని మంత్రివర్గంలో లుకలుకలు కనిపిస్తున్నాయి. సీఎం యోగి ఆదిత్య నాథ్ పై ఇద్దరు మంత్రులు తీవ్ర అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తం చేశారు. వారిలో ఒకరు ఏకంగా రాజీనామానే సమర్పించగా.. మరొకరు బీజేపీ అధిష్ఠానానికి ఫిర్యాదు చేసేందుకు ఢిల్లీ వెళ్లడం సంచలనం సృష్టిస్తోంది. దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉంది. పలుచోట్ల బీజేపీ నేతల్లో అసంతృప్తి ఉన్నా ఎప్పుడూ బహిరంగంగా వ్యక్తం కాలేదు. అలాంటిది యూపీ వంటి చోట ఇలా జరగడం చర్చనీయాంశంగా మారింది.
రాజీనామా చేసిన మంత్రి దినేశ్ ఖాటిక్
ఉత్తర ప్రదేశ్ జల వనరుల శాఖ మంత్రి దినేశ్ తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. తాను దళితుడిని కావడం వల్లే నిర్లక్ష్యం చూపుతున్నారని, ఏ మాత్రం ప్రాధాన్యత ఇవ్వడం లేదని ఆరోపించారు. దినేశ్ తన రాజీనామా లేఖను కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు పంపారు.
‘‘నేను దళితుడిని కావడం వల్ల నాకు ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వడం లేదు. ఒక మంత్రిగా నాకు ఎలాంటి అధికారాలు లేవు. గత వంద రోజులుగా నాకు ఎలాంటి పని లేదు. అధికారిక సమావేశాలకు పిలవలేదు. నా శాఖ గురించే నాకు ఏమీ చెప్పడం లేదు. ఇది దళిత సమాజానికి అవమానమే. ఇలా నేను మంత్రిగా ఉండటం దళిత సమాజానికి ఏ ప్రయోజనమూ లేదు. ఇది నాకు ఎంతో ఆవేదన కలిగిస్తోంది. అందుకే రాజీనామా చేస్తున్నా” అని దినేశ్ ఖాటిక్ తన లేఖలో పేర్కొన్నారు. అయితే.. దినేశ్ ను సముదాయించేందుకు అధిష్ఠానం నేతలు ప్రయత్నిస్తున్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
అవినీతి అంశంపై ఆగ్రహంతో..
యూపీ ప్రజా పనుల శాఖ మంత్రి జితిన్ ప్రసాద కూడా సీఎం యోగి ఆదిత్యనాథ్ పై ఆగ్రహంతో ఉన్నారు. ఇటీవల యూపీలో అవినీతి ఆరోపణల మేరకు కొందరు అధికారులను రాష్ట్ర ప్రభుత్వం సస్పెండ్ చేసింది. అందులో మంత్రి జితిన్ ప్రసాద పీఏ కూడా ఉన్నారు. ఈ వ్యవహారంపై సీఎం యోగి ఇటీవల జితిన్ ప్రసాదను పిలిపించి మందలించారని.. దీనితో జితిన్ ఆగ్రహంగా ఉన్నారని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. ఈ అంశంపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు, కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు ఫిర్యాదు చేసేందుకు ఢిల్లీ వెళ్లారని అంటున్నాయి.