Sonia Gandhi: నేడు ఈడీ ముందుకు సోనియా గాంధీ.... దేశవ్యాప్త నిరసనలకు కాంగ్రెస్ నిర్ణయం

Congress supremo Sonia Gandhi will attend ED questioning

  • నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియాపై ఆరోపణలు
  • మనీలాండరింగ్ వ్యవహారంలో ఈడీ విచారణ
  • ఇప్పటికే రాహుల్ ను విచారించిన ఈడీ అధికారులు
  • ఇటీవలే సోనియాకు సమన్లు
  • కరోనా నుంచి కోలుకున్న కాంగ్రెస్ అధినేత్రి

నేషనల్ హెరాల్డ్ మనీలాండరింగ్ కేసులో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ నేడు ఈడీ ఎదుట విచారణకు హాజరుకానున్నారు. కరోనా నుంచి కోలుకున్న సోనియాకు ఇటీవలే ఈడీ అధికారులు నోటీసులు పంపారు. ఆమెకు గతంలోనే నోటీసులు పంపినా, కరోనా కారణంగా ఆసుపత్రిపాలవడంతో విచారణకు హాజరుకాలేదు. దాంతో ఈ నెల 21న విచారణకు రావాలంటూ తాజా నోటీసుల్లో స్పష్టం చేశారు.

ఈ కేసులో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని ఇప్పటికే ఈడీ అధికారులు విచారించారు. ఐదు రోజుల పాటు ఆయనపై ప్రశ్నలవర్షం కురిపించారు. దాదాపు 50 గంటల పాటు రాహుల్ ఈడీ విచారణలో గడిపారు. రాహుల్ ను ఈడీ విచారిస్తున్న సమయంలో కాంగ్రెస్ శ్రేణులు దేశవ్యాప్త నిరసనలు చేపట్టాయి. 

తాజాగా, అధినేత్రి సోనియా ఈడీ విచారణకు హాజరవుతున్న నేపథ్యంలోనూ, దేశవ్యాప్త నిరసనలకు కాంగ్రెస్ పార్టీ సన్నద్ధమైంది. దేశరాజధాని ఢిల్లీలో జరిగే ఆందోళనల్లో కాంగ్రెస్ అగ్రనేతలు పాల్గొననున్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయం నుంచి ఈడీ ఆఫీసు వరకు ప్రదర్శన చేపట్టనున్నారు.

కాంగ్రెస్ వర్గాల నిరసనల నేపథ్యంలో ఢిల్లీలో భారీగా పోలీసులను మోహరించారు. కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయం ఉన్న అక్బర్ రోడ్డును ఇప్పటికే మూసివేశారు. అటువైపు ఎవరూ వెళ్లకుండా బారికేడ్లు ఏర్పాటు చేశారు.

  • Loading...

More Telugu News