bsp: ముందు తమరు అందుకున్న 50 లక్షల ‘మెఘా’ పారితోషికం గురించి వివరణ ఇవ్వండి: రజత్ కుమార్‌పై ప్రవీణ్ కుమార్ ట్వీట్
- పంప్ హౌజుల మునక వల్ల నష్టం రూ. 25 కోట్లే అన్న రజత్
- ప్రాజెక్టుకు ఏమీ జరగనప్పుడు పంపుల దగ్గరికి వెళ్తుంటే ఎందుకు అరెస్ట్ చేస్తున్నారని నిలదీసిన ప్రవీణ్ కుమార్
- కాళేశ్వరం డిజైన్, అంచనాలను ప్రజలకు చూపెట్టే దమ్ముందా? అని ప్రశ్నించిన బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు
భారీ వర్షం, వరదల కారణంగా కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమైన అన్నారం, మేడిగడ్డ పంజ్ హౌజ్ లు నీట మునగడం వల్ల రూ. వందల కోట్ల నష్టం వాటిల్లిందని వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని తెలంగాణ నీటి పారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ కుమార్ అన్నారు. పంప్ హౌజ్ ల మునక వల్ల కేవలం రూ. 20 కోట్ల నుంచి 25 కోట్ల వరకు నష్టం కలిగిందని ప్రకటించారు.
దీనిపై బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ స్పందించారు. ప్రాజెక్టుకు అంత నష్టం వాటిల్లనప్పుడు పంపుల దగ్గరికి పోకుండా తమను ఎందుకు అరెస్ట్ చేస్తున్నారని ప్రశ్నించారు. కాళేశ్వరం డిజైన్, అంచనాలను బహిర్గతం చేయాలని ట్వీట్ చేశారు.
‘రజత్ గారు, కాళేశ్వరం పంపుల మునక గురించి మాట్లాడే ముందు తమరు అందుకున్న రూ. 50 లక్షల ‘మెఘా’ పారితోషికం గురించి వివరణ ఇవ్వండి. ఏం జరగనప్పుడు మమ్మల్నెందుకు పంపుల దగ్గరికి పోకుండా అరెస్టు చేస్తున్నారు? కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్, అంచనాలను ప్రజలకు చూపించే దమ్ముందా?’ అని ప్రవీణ్ కుమార్ ట్విటర్ లో ప్రశ్నించారు.