President Of India: భారత 15 రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము... విజయం సాధించిన ఎన్డీఏ అభ్యర్థి
- మూడో రౌండ్ పూర్తి అయ్యేసరికి 2,161 ఓట్లు సాధించిన ముర్ము
- యశ్వంత్‌కు 1,058 ఓట్లు లభించిన వైనం
- ముర్ము విజయంపై ప్రకటన ఇక లాంఛనమే
- ఈ నెల 25న భారత 15వ రాష్ట్రపతిగా ప్రమాణం చేయనున్న ముర్ము
భారత 15వ రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము ఎన్నికయ్యారు. గురువారం ఢిల్లీలోని పార్లమెంటు వేదికగా జరుగుతున్న ఓట్ల లెక్కింపు పూర్తి కాకుండానే ఆమె విజయం సాధించారు. ఓట్ల లెక్కింపు ఇంకా కొనసాగుతుండగానే... రాత్రి 8 గంటల ప్రాంతానికే పూర్తి ఓట్లలో సగానికిపైగా ఓట్లను దక్కించుకున్న ముర్ము ఎన్నికల్లో విజయం సాధించారు. రెండో రౌండ్ ఓట్ల లెక్కింపు పూర్తి అయ్యేసరికే తన సమీప ప్రత్యర్థి, విపక్షాల ఉమ్మడి అభ్యర్థి యశ్వంత్ సిన్హాపై భారీ ఆధిక్యత సాధించిన ముర్ము.. మూడో రౌండ్లోనే అధిక్యం కొనసాగించారు. ఈ క్రమంలో మూడో రౌండ్ ఓట్ల లెక్కింపు పూర్తి కాకుండానే ఆమె విజయం ఖరారైంది.
వరుసబెట్టి మూడు రౌండ్లలోనూ స్పష్టమైన ఆధిక్యత కనబరచిన ముర్ము మూడో రౌండ్ పూర్తి అయ్యే సరికి 2,161 ఓట్లు వచ్చాయి. దీంతో సగానికి పైగా ఓట్లను సాధించిన ముర్ము విజేతగా నిలిచారు. ఇక మూడో రౌండ్ల లెక్కింపు పూర్తి అయ్యేసరికి యశ్వంత్ సిన్హాకు 1,058 మాత్రమే వచ్చాయి. దీంతో ద్రౌపది ముర్ము విజయం ఖాయమైపోయింది. మరికాసేపట్లోనే ద్రౌపది ముర్ము రాష్ట్రపతి ఎన్నికల్లో విజయం సాధించినట్లు అధికారిక ప్రకటన వెలువడనుంది. ఈ నెల 25న ముర్ము భారత 15వ రాష్ట్రపతిగా పదవీ బాధ్యతలు చేపట్టనున్నారు.