Dinesh Gunawardena: శ్రీలంక తదుపరి ప్రధానిగా దినేశ్ గుణవర్ధనే!
- శ్రీలంకలో నూతన ప్రభుత్వానికి ఏర్పాట్లు
- అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేసిన రణిల్ విక్రమసింఘే
- రేపు క్యాబినెట్ నియామకం
- ప్రధాని పేరును ప్రకటించే అవకాశం
ఇటీవల గొటబాయ రాజపక్స దేశం విడిచి వెళ్లిపోయిన నేపథ్యంలో, ప్రధాని రణిల్ విక్రమసింఘేను నూతన దేశాధ్యక్షుడిగా పార్లమెంటు సభ్యులు ఎన్నుకోవడం తెలిసిందే. ప్రధాని పదవి ఖాళీ అవడంతో, ఇప్పుడా పదవిని అధిష్టించబోయేది దినేశ్ గుణవర్ధనే అని తెలుస్తోంది. నూతన అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే కొత్త క్యాబినెట్ ను రేపు ఏర్పాటు చేయనున్నారు. ఈ క్రమంలోనే సీనియర్ ఎంపీ దినేశ్ గుణవర్ధనేను ప్రధానిగా ప్రకటిస్తారని రాజకీయ వర్గాలు వెల్లడించాయి.
శ్రీలంక రాజకీయాల్లో ఇటీవల చోటుచేసుకున్న పరిణామాలతో రాజపక్స సోదరుల హవా పూర్తిగా ముగిసినట్టేనని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మహీంద రాజపక్స ప్రధాని పదవి కోల్పోగా, బసిల్ రాజపక్స మంత్రి పదవి నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. ఇక, గొటబాయ రాజపక్స దేశంలో ఉండలేని పరిస్థితుల్లో మాల్దీవులకు పారిపోయి, అక్కడ్నించి సింగపూర్ వెళ్లిపోయారు.