Telangana: రాష్ట్రపతి ఎన్నికల్లో చెల్లని సీతక్క ఓటు... కారణమిదే!
- తెలంగాణ అసెంబ్లీలో ఓటేసిన సీతక్క
- బ్యాలెట్ పేపర్‌పై పొరపాటున సిరా చుక్కలు పడిన వైనం
- మరో బ్యాలెట్ పేపర్ ఇవ్వాలని కోరిన కాంగ్రెస్ ఎమ్మెల్యే
- కుదరదన్న ఎన్నికల అధికారులు
- సిరా చుక్కలు పడిన బ్యాలెట్ పేపర్‌తోనే ఓటేసిన వైనం
అనుకున్నంతా అయ్యింది. రాష్ట్రపతి ఎన్నికల్లో తెలంగాణకు చెందిన కాంగ్రెస్ నేత, ములుగు ఎమ్మెల్యే దనసిరి అనసూయ అలియాస్ సీతక్క ఓటు చెల్లుబాటు కాలేదు. గురువారం జరిగిన ఓట్ల లెక్కింపులో సీతక్క ఓటును చెల్లని ఓటుగా పరిగణించిన అధికారులు... దానిని పక్కన పడేశారు. పోలింగ్ సందర్భంగా జరిగిన చిన్న పొరపాటు కారణంగా ఆమె ఓటు చెల్లుబాటు అవుతుందా? లేదా? అన్న చర్చ జరిగిన సంగతి తెలిసిందే.
పోలింగ్ రోజున తనకు ఇచ్చిన బ్యాలెట్ పేపర్‌పై పొరపాటున సిరా పడిందని, వేరే బ్యాలెట్ పత్రం ఇవ్వాలని సీతక్క ఎన్నికల అధికారులను కోరారు. అయితే ఆమెకు మరో బ్యాలెట్ పేపర్ ఇచ్చేందుకు అధికారులు నిరాకరించారు.
ఈ క్రమంలో తప్పనిసరి పరిస్థితిలో సిరా గీతలు పడిన బ్యాలెట్ పేపర్‌తోనే ఓటు వేసినట్లు ఆ రోజే సీతక్క తెలిపారు. సిరా చుక్కలు పడినందున తన ఓటు చెల్లుబాటు అవుతుందో, లేదో తనకు తెలియదని చెప్పిన సీతక్క... ఇందులో తన తప్పేమీ లేదని, నిబంధనల ప్రకారమే ఓటేశానని చెప్పుకొచ్చారు. తాజాగా ఆమె ఓటును ఎన్నికల అధికారులు చెల్లని ఓటుగా పరిగణించారు.