Anand Mahindra: జమ్మూ కశ్మీర్ మాస్టారి 'సోలార్ కారు'కు ఆనంద్ మహీంద్రా ఫిదా!
- ప్రోటోటైపు వాహనాన్ని రూపొందించడం పట్ల అభినందనలు
- ఒంటి చేత్తో అభివృద్ధి చేయడంపై ప్రశంసలు
- అతడితో కలసి తమ బృందం పనిచేస్తుందన్న పారిశ్రామికవేత్త
జమ్మూ కశ్మీర్ కు చెందిన లెక్కల మాస్టారు సొంత మేధాశక్తితో తయారు చేసిన సోలార్ కారు ఆవిష్కరణకు తగిన గుర్తింపు లభించింది. ప్రముఖ పారిశ్రామికవేత్త మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ చైర్మన్ ఆనంద్ మహీంద్రా ఈ కారును మెచ్చుకున్నారు.
బిలాల్ అహ్మద్ 11 ఏళ్లపాటు అధ్యయనం, పరిశోధన చేసి ఈ కారు తయారు చేశాడు. ఇది సూర్యరశ్మి ఆధారంగా పనిచేస్తుంది. పర్యావరణ అనుకూల వాహనాలకు కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున మద్దతుగా నిలుస్తున్న సమయంలో అహ్మద్ సోలార్ కారును తీసుకురావడం గమనార్హం. ఆటోమొబైల్ రంగంలో టెక్నాలజీ ఆవిష్కరణలకు ఆనంద్ మహీంద్రా మద్దతుగా నిలుస్తుంటారు. ఈ క్రమంలో ఆయన కంట్లో బిలాల్ అహ్మద్ సోలారు కారు పడింది.
‘‘బిలాల్ అభిరుచి మెచ్చుకోతగినది. ఒంటి చేత్తో ఈ ప్రోటోటైప్ వాహనాన్ని అభివృద్ధి చేయడాన్ని అభినందిస్తున్నా. తయారీకి అనుకూలమైన విధంగా ఈ డిజైన్ మార్పు చెందాలి. మహీంద్రా రీసెర్చ్ వ్యాలీలోని మా నిపుణుల బృందం అతడితో కలసి మరింతగా అభివృద్ధి చేయడంపై దృష్టి పెడుతుంది’’ అంటూ ట్వీట్ చేశారు.