Gautam Gambhir: ఢిల్లీ సీఎం 'మహా మాయగాడు' అంటూ కేజ్రీవాల్ పై గౌతమ్ గంభీర్ విమర్శలు
- ఢిల్లీ మద్యం విధానంపై విమర్శలు
- సీఎస్ నివేదికతో రాజుకున్న అగ్గి
- సీబీఐ విచారణకు లెఫ్టినెంట్ గవర్నర్ సిఫారసు
- ఆప్ కు మద్యంపై ప్రేమ అని గంభీర్ వ్యాఖ్యలు
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పై బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్ ధ్వజమెత్తారు. ఆప్ ప్రభుత్వ కొత్త మద్యం పాలసీపై సీబీఐ విచారణకు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా సిఫారసు చేయడం పట్ల గంభీర్ స్పందించారు. మద్యంపై ప్రేమతో ఢిల్లీనే నాశనం చేయడానికి కంకణం కట్టుకున్నారని విమర్శించారు. 'అబద్దాల కోరు' కాస్తా, ఇప్పుడు 'మహా మాయగాడు'గా మారిపోయాడని గంభీర్ ట్వీట్ చేశారు.
ఢిల్లీ మద్యం విధానం (2021-22)పై సీఎస్ ఇచ్చిన నివేదిక ఆధారంగా లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా సీబీఐ విచారణకు మొగ్గు చూపారు. కాగా, ఇదే లేఖను సీఎస్ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు కూడా పంపారు. మద్యం పాలసీ వెనుక రాజకీయపరంగా ఉన్నతస్థాయిలో ఆర్థిక క్విడ్ ప్రో కో చోటుచేసుకుందని ఆరోపించారు. ఎక్సైజ్ శాఖ మంత్రి మనీశ్ సిసోడియా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుని అమలు చేశారని సీఎస్ వివరించారు. మద్యం విధానం కోసం చట్టబద్ధమైన నిబంధనలను కూడా తుంగలో తొక్కారని ఆరోపించారు.
అయితే సిసోడియాపై ఆరోపణలను సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఖండించారు. ఆప్ నేతలను తప్పుడు కేసుల్లో ఇరికించాలన్న బీజేపీ ప్రయత్నాల్లో భాగంగానే ఈ ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.