Heavy Rain: మరి కాసేపట్లో హైదరాబాదులో భారీ వర్షం ... నగర ప్రజలకు ట్రాఫిక్ పోలీసుల సూచనలు
- ఈ ఉదయం నుంచి హైదరాదబాదులో వర్షం
- మరో మూడు గంటల్లో భారీ వర్షం పడే అవకాశం
- అప్రమత్తమైన అధికారులు
- వర్షం ఆగిన గంట తర్వాత ప్రజలు రోడ్లపైకి రావాలని సూచన
ఇటీవల వరుసగా వారంరోజుల పాటు హైదరాబాద్ ను వర్షాలు ముంచెత్తడం తెలిసిందే. కొన్నిరోజులు విరామం ఇచ్చిన వరుణుడు ఇప్పుడు మళ్లీ ప్రత్యక్షమయ్యాడు. ఈ ఉదయం నుంచి నగరంలో వర్షం కురుస్తోంది. మరో మూడు గంటల్లో నగరంలో భారీ వర్షం కురియనుందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. 100 మిమీ పైగా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. రేపు కూడా నగరంలో భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.
ఈ నేపథ్యంలో, ట్రాఫిక్ పోలీసులు నగర జీవులకు సూచనలు చేశారు. వర్షం నిలిచిన వెంటనే రోడ్లపైకి వచ్చే ప్రయత్నం చేయవద్దని స్పష్టం చేశారు. వర్షం ఆగిన గంట తర్వాత రోడ్లపైకి రావాలని స్పష్టం చేశారు. ఆఫీసులు, వ్యాపార, వాణిజ్య సముదాయాలకు, స్కూళ్లకు, కాలేజీలకు వెళ్లేవారు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కాగా, జులైలో ఇదే అతిపెద్ద వర్షం కావొచ్చని అధికారులు ముందస్తు అంచనా వెలువరించారు.