Dinesh Gunawarfrna: శ్రీలంక నూతన ప్రధాని తండ్రికి భారత స్వాతంత్య్రోద్యమంతో సంబంధాలు
- శ్రీలంక నూతన ప్రధానిగా దినేశ్ గుణవర్ధనే
- ఆయన తండ్రి డాన్ ఫిలిప్ రూపసింఘే గుణవర్ధనే సీనియర్ నేత
- స్వాతంత్య్రోద్యమంలో జైలుకెళ్లొచ్చిన చరిత్ర
- గతంలో వ్యవసాయమంత్రిగా పనిచేసిన వైనం
శ్రీలంక 15వ ప్రధానమంత్రిగా దినేశ్ గుణవర్ధనే పదవీప్రమాణం చేశారు. కాగా, ఆయన తండ్రి డాన్ ఫిలిప్ రూపసింఘే గుణవర్ధనే భారత స్వాతంత్య్రోద్యమంతో సంబంధాలు కలిగిన వ్యక్తి అని ఈ సందర్భంగా స్థానిక మీడియా పేర్కొంది. ఆయన సామ్రాజ్యవాదానికి, వలస వాదానికి వ్యతిరేకంగా పోరాటం చేశారని, భారత స్వాతంత్ర్య పోరాటంలోనూ కీలకపాత్ర పోషించాడని వివరించింది.
సీనియర్ గుణవర్ధనే విదేశాల్లో ఉన్నత విద్యాభ్యాసం చేశారు. లండన్ లో చదువుకున్న సందర్భంగా ఆయనకు జవహర్ లాల్ నెహ్రూ, జోమో కెన్యట్టా (కెన్యా) వంటి అంతర్జాతీయ స్వాతంత్ర్య పోరాట యోధులతో పరిచయం ఏర్పడింది. తదనంతర కాలంలో ఆయన నెహ్రూ, కృష్ణమీనన్ వంటి నేతలతో కలిసి సామ్రాజ్యవాద వ్యతిరేక ఇండియన్ లీగ్ కోసం పనిచేశారు. అంతేకాదు, లోక్ నాయక్ జయప్రకాశ్ నారాయణన్ తోనూ సన్నిహితంగా మెలిగారు.
1942లో భారత స్వాతంత్ర్య పోరాటంలోకి దుమికిన సీనియర్ గుణవర్ధనేను తెల్లవాళ్లు బంధించి జైలుపాలు చేశారు. ఆయన పెద్ద కుమారుడు భారత్ లో ఉన్నప్పుడే జన్మించాడు. 1943లో ఆయనను శ్రీలంక తరలించి ఆర్నెల్ల పాటు ఖైదు చేశారు. ఆయన 1972 మార్చి 26న మరణించారు.
వామపక్ష భావాలున్న డాన్ ఫిలిప్ రూపసింఘే గుణవర్ధనే లంక సమసమాజ పార్టీ స్థాపించారు. ఆయనను ఫాదర్ ఆఫ్ సోషలిజంగా పిలుస్తారు. 1956 నుంచి 59 వరకు శ్రీలంక వ్యవసాయ, ఆహార మంత్రిగా పనిచేశారు.