Kurnool District: అడవి పందులను చూసి బెదిరిపోయి.. ‘తెలుగు గంగ’లోకి దూకిన ఆవుల మంద!
- నంద్యాల జిల్లా వెలుగోడు వద్ద ఘటన
- దాదాపు వెయ్యి ఆవులను మేపుకుంటూ వెళ్లిన కాపర్లు
- అడవి పందుల గుంపు రావడంతో భయపడి పరుగులు తీసిన ఆవుల మంద
- గల్లంతైన వాటి కోసం గాలింపు
అడవి పందులను చూసి బెదిరిపోయిన ఆవుల మంద తెలుగు గంగ జలాశయంలో దూకింది. అప్రమత్తమైన మత్స్యకారులు వాటిలో 400 ఆవులను రక్షించి సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. మరో 50 గోవులు గల్లంతయ్యాయి. నంద్యాల జిల్లా వెలుగోడు వద్ద ఈ ఘటన జరిగింది. గ్రామానికి చెందిన కొందరు దాదాపు 1000 ఆవులను మేపుకుంటూ నిన్న ఉదయం గ్రామ సమీపంలోని తెలుగు గంగ జలాశయం పక్కనే ఉన్న మైదాన ప్రాంతానికి వెళ్లారు.
అదే సమయంలో అడవి పందుల గుంపు పరుగులు పెడుతూ రావడంతో బెదిరిపోయిన ఆవులు తెలుగు గంగ జలాశయం వైపు పరుగులు తీశాయి. వీటిలో దాదాపు 500 గోవులు కట్టపై ఆగిపోగా, 450 ఆవులు జలాశయంలో దూకేశాయి. వెంటనే అప్రమత్తమైన వాటి యజమానులు మత్స్యకారుల సాయంతో దాదాపు 400 ఆవులను రక్షించి ఒడ్డుకు చేర్చారు. మరో 50 ఆవులు కొట్టుకుపోయాయి. సమాచారం అందుకున్న పోలీసులు పుట్టిపై జలాశయంలోకి వెళ్లి వాటి కోసం గాలింపు చేపట్టారు.