Soorarai Pottru: జాతీయ అవార్డు రావడంతో అర్ధాంగి జ్యోతికకు థ్యాంక్స్ చెప్పిన సూర్య
- సినిమాను నిర్మించేందుకు, నటించేందుకు ఎంతో ప్రోత్సహించినట్టు వెల్లడి
- దేశవ్యాప్త గుర్తింపుతో సంతోషం రెట్టింపైందన్న నటుడు
- అవార్డులు గెలుచుకున్న సహ కళాకారులకు అభినందనలు
సూర్య నటించిన 'సూరారై పోట్రు' సినిమాను 68వ జాతీయ అవార్డులలో ఐదు అవార్డులు వరించాయి. ఉత్తమ నటుడిగా సూర్యకు సైతం ఈ సినిమాతో అవార్డు దక్కింది. దీనిపై నటుడు సూర్య స్పందించాడు.
‘‘నా పట్ల ప్రేమ చూపించి, శుభాకాంక్షలు చెప్పిన అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. సూరారై పోట్రుకు ఐదు అవార్డులు రావడం పట్ల ఎంతో సంతోషంగా ఉంది. కరోనా మహమ్మారి సమయంలో ఓటీటీ ద్వారా నేరుగా విడుదల చేసిన ఈ సినిమాకు అద్భుతమైన ఆమోదం లభించింది. ఆనందంతో మా కళ్లు చెమర్చేలా చేసింది. సూరారై పోట్రుకు దేశవ్యాప్త గుర్తింపు లభించడం పట్ల మా సంతోషం రెట్టింపైంది. సుధ కొంగర ఎన్నో ఏళ్ల శ్రమ, కెప్టెన్ గోపీనాథ్ స్టోరీ విజన్ కు ఇది నిదర్శనం’’ అంటూ సూర్య తన అభిప్రాయాలను పంచుకున్నాడు.
ఉత్తమ నటిగా ఈ సినిమాకు పనిచేసి అవార్డు సొంతం చేసుకున్న అపర్ణ బాలమురళి, జీవీ ప్రకాష్ (బ్యాక్ గ్రౌండ్ స్కోర్), సుధ కొంగర, షాలిని ఉషా నాయర్ (ఉత్తమ స్క్రీన్ ప్లే)లకు సూర్య అభినందనలు చెప్పాడు. ఈ మేరకు ఓ పెద్ద లేఖను ట్విట్టర్లో పోస్ట్ చేశాడు. సూరారై పోట్రు సినిమాను చేసే విషయంలో తనను ఎంతగానో ప్రోత్సహించిన తన భార్య జ్యోతికకు కూడా సూర్య స్వీట్ గా థ్యాంక్స్ చెప్పాడు.
‘‘నా జ్యోతికకు ప్రత్యేక ధన్యవాదాలు. సూరారై పోట్రు సినిమాను నిర్మించేందుకు, అందులో నటించేందుకు ఆమే నన్ను ప్రోత్సహించింది. ఇప్పటి వరకు నా కృషిని ప్రోత్సహించిన ప్రతి ఒక్కరికీ, మా అమ్మ, అప్ప, కార్తీ, బృందాలకు కూడా ప్రేమతో ధన్యవాదాలు’’ అని సూర్య పేర్కొన్నాడు.