Pattabhi: సూట్ కేసు కంపెనీలు ఏర్పాటు చేయడంలో వీరిద్దరూ దిట్ట: పట్టాభి
- జగన్, విజయసాయిలను మించినవారు ఎవరూ లేరు
- బ్యాంకుల నుంచి నిధులు కొల్లగొట్టేందుకు సూట్ కేస్ కంపెనీలు ఏర్పాటు చేస్తున్నారు
- కార్పొరేషన్ల పేరుతో డబ్బులు తెచ్చి అవినీతికి పాల్పడుతున్నారు
ముఖ్యమంత్రి జగన్, వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డిలపై టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభి విమర్శలు గుప్పించారు. సూట్ కేస్ కంపెనీలను ఏర్పాటు చేయడంలో వీరిద్దరికీ మించిన వాళ్లు ఎవరూ లేరని అన్నారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత బ్యాంకుల నుంచి నిధులు కొల్లగొట్టేందుకు సూట్ కేస్ కంపెనీలను ఏర్పాటు చేస్తున్నారని విమర్శించారు. ఏపీఎస్డీసీ పేరుతో కంపెనీని ఏర్పాటు చేసి బ్యాంకుల నుంచి రూ. 25 వేల కోట్ల రుణాలను కొల్లగొట్టారని ఆరోపించారు. కార్పొరేషన్ల పేరుతో డబ్బులు తెచ్చి, వాటిని దారి మళ్లించి, అవినీతికి పాల్పడుతున్నారని దుయ్యబట్టారు.
కార్పొరేషన్ల పేరుతో ఏపీ చేస్తున్న అప్పులపై రిజర్వ్ బ్యాంక్ కూడా ఆందోళన వ్యక్తం చేసిందని పట్టాభి అన్నారు. అవినీతికి పాల్పడుతున్నారని తాము ముందు నుంచి ఆందోళన వ్యక్తం చేస్తూనే ఉన్నామని... తమ మాదిరే ఇప్పుడు ఆర్బీఐ కూడా ఆందోళన వ్యక్తం చేసిందని చెప్పారు. రూ. 25 వేల కోట్లకు రాష్ట్ర ప్రభుత్వం గ్యారెంటీ కోసం ఇచ్చిన జీవో నెంబర్ 92 కూడా ఆర్బీఐ మార్గదర్శకాలను ఉల్లంఘించడమేనని అన్నారు.