Nara Lokesh: నీటిలోకి దూకిన గోవులను కాపాడిన మత్స్యకారుల వీడియో ఇదిగో... అభినందించిన నారా లోకేశ్
- నంద్యాల జిల్లా వెలుగోడులో ఘటన
- నల్లమల అడవులను ఆనుకుని ఎన్టీఆర్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్
- దాని పరిసరాల్లోకి మేత కోసం ఆవులు, గేదెల మందలు
- అడవి పందులను చూసి నీటిలోకి దూకిన ఆవులు
- ఆవులను సురక్షితంగా ఒడ్డుకు తరలించిన మత్స్యకారులు
మేత కోసం వెళ్లి అడవి పందుల సమూహాన్ని చూసి బెదిరిపోయి నీటిలోకి దూకేసిన ఆవులను మత్స్యకారులు సురక్షితంగా ఒడ్డుకు చేర్చిన వీడియోను టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. మూగ జీవాలైన ఆవుల మందను అత్యంత చాకచక్యంగా మత్స్యకారులు ఒడ్డుకు తరలించారని ఈ సందర్భంగా లోకేశ్ పేర్కొన్నారు. మత్స్యకారులను ఆయన ప్రశంసించారు. ఆవులను కాపాడిన మత్స్యకారులు... ఆవులపై ఆధారపడ్డ పాడి రైతు కుటుంబాలను కూడా కాపాడినట్టేనని కూడా ఆయన పేర్కొన్నారు.
నంద్యాల జిల్లా పరిధిలోని వెలుగోడు వద్ద తెలుగు గంగ కాలువపై కట్టిన ఎన్టీఆర్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ వద్ద ఈ ఘటన శుక్రవారం చోటుచేసుకుంది. నల్లమల అటవీ ప్రాంతాన్ని ఆనుకుని బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ఉండటంతో దాని పరిసరాల్లోనూ ఆవులు, గేదెలను మేత కోసం వాటి యజమానులు తీసుకెళుతూ ఉంటారు.
ఈ క్రమంలో అడవిలో నుంచి పందుల సమూహం వేగంగా పరుగులు తీస్తూ రావడంతో భీతిల్లిపోయిన గోవుల మందలోని కొన్ని ఆవులు రిజర్వాయర్ లోని నీటిలోకి దూకేశాయి. దీంతో షాక్కు గురైన వాటి కాపరులు సమీపంలో ఉన్న మత్స్యకారులను అప్రమత్తం చేయగా... వారు చిన్న బోట్లతో నీటిలోకి వెళ్లి ఆవులను ఒడ్డుకు చేర్చారు.