Cock: కోడిపుంజు దశదినకర్మకు 500 మందికి భోజనాలు పెట్టారు!
- ఉత్తరప్రదేశ్ లో జరిగిన ఆసక్తికర ఘటన
- గొర్రె పిల్లను కాపాడిన కోడిపుంజు
- దాని త్యాగం, ప్రేమకు కదిలిపోయిన కుటుంబం
తమ పెంపుడు జంతువులు చనిపోతే వాటికి తమ కుటుంబ సభ్యుల మాదిరే అంత్యక్రియలు చేసే వారు కూడా ఉంటారు. కొందరు సమాధులు కూడా కట్టిస్తుంటారు. ఇలాంటి ఘటనే మరొకటి జరిగింది. తమ పెంపుడు కోడిపుంజుకు దశదినకర్మ నిర్వహించడమే కాకుండా... 500 మందికి భోజనాలు కూడా పెట్టారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లో జరిగింది.
వివరాల్లోకి వెళ్తే, ఓ కుటుంబం ఒక కోడిపుంజును పెంచుకుంటోంది. ఒకరోజు వారు పెంచుకుంటున్న ఒక నెల వయసున్న గొర్రె పిల్లను అది కాపాడింది. ప్రాణాలకు తెగించి, ఊరకుక్కల బారి నుంచి కాపాడింది. ఈ క్రమంలో అది తీవ్రంగా గాయపడి ప్రాణాలు కోల్పోయింది.
దాని త్యాగం, ప్రేమ ఆ కుటుంబాన్ని కలచివేసింది. దీంతో, మనిషికి ఎలాగైతే అంత్యక్రియలు చేస్తారో దానికి కూడా అలాగే చేశారు. అంతేకాదు, దాని ఆత్మకు శాంతి చేకూరాలని దశదినకర్మను కూడా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి దాదాపు 500 మంది వరకు హాజరయ్యారు. అందరికీ ఆ కుటుంబం భోజనాలు కూడా పెట్టింది.